దేశంలో కరోనా మహమ్మారి విజృంభణతో కేంద్రం అకస్మాత్తుగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల చాలామంది ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. సొంతూళ్లకు చేరుకోవాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ లాక్ డౌన్ సమయంలో వలస కూలీల పట్ల, విద్యార్థుల పట్ల చూపిస్తున్న దయ, ఆదరాభిమానాలు, అంత ఇంతా కాదు. ఏపీ సీఎం జగన్ వలస కూలీల, విద్యార్థుల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సొంతూళ్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. 
 
తాజాగా ఈరోజు ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజాద్ బాషా చొరవతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సహరాన్పూర్ జిల్లాలో ఉన్న 134 మంది ఏపీ వాసులు సొంతూళ్లకు చేరుకున్నారు. సహరాన్పూర్ లోని మదరసాలో ఏపీకి చెందిన 134 మంది ముస్లిం మైనారిటీ పిహెచ్.డి. విద్యార్థులు లాక్ డౌన్ వల్ల అక్కడే చిక్కుకుపోయారు. దాదాపు 50 రోజులు అక్కడ ఇబ్బందులు పడ్డారు. కడప జిల్లాకు చెందిన నూర్ అనే విద్యార్థి ఈ నెల 15వ తేదీన మంత్రికి ఫోన్ చేసి వారి అవస్థలు విన్నవించుకున్నారు. 
 
మంత్రి వెంటనే సీఎం జగన్ తో మాట్లాడి బస్సులను ఏర్పాటు చేసి 17 వ తేదీ రాత్రి 5 బస్సులలో 134 మందిని రాష్ట్రానికి రప్పించారు. కడప నగరంలోని వైఎస్ఆర్ సర్కిల్ లో వారు బస్సుల నుండి దిగి సకాలంలో స్పందించిన అంజాద్ భాషాకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఉత్తర ప్రదేశ్ నుంచి రాష్ట్రానికి వచ్చిన 5 బస్సులలో.. కడప(30), అనంతపురం(16), చిత్తూరు(25), విజయవాడ(30), కర్నూల్(34) కు చెందిన వారు ఉన్నారు. మంత్రి కడపకు వచ్చిన వారి యోగక్షేమాలను కనుక్కున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినవారిని 14 రోజులు క్వారంటైన్ లో ఉంచి సొంతూళ్లకు తరలించనున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: