బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లోనూ పసిడి ధరలు ఆల్ టైం హైకి చేరుకున్నాయి. యూఎస్, చైనాల ట్రేడ్ వార్, మరోవైపు ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావంతో., ట్రేడర్లు బంగారంపై పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మన దేశంలో వరుసగా రెండో రోజు గోల్డ్ రేట్ రికార్డుకెక్కింది.

 

బంగారం, వెండి ధరలు  కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.  ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు ఏడు సంవత్సరాల గరిష్టానికి చేరుకున్నాయి. 2012 అక్టోబర్  తర్వాత బంగారం ధర అత్యధికంగా పెరగడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్లాటినం 0.7 శాతం, వెండి ధరలు 2 శాతం పెరిగాయి. ఈ ఏడాది ప్రపంచ మార్కెట్లో బంగారం ధర 16 శాతం పెరిగింది.

 

హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర  50 వేల వైపు పరుగులు తీస్తోంది. సోమవారం 10 గ్రాములపై 390 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం 24 క్యారట్ బంగారం ధర  48 వేల 930 కాగా, 22 క్యారట్ బంగారం ధర 45 వేల 860కి చేరింది.  అటు వెండి ధర కూడా భారీగా పెరిగింది.  హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి 48 వేల 500 రూపాయలుగా ఉంది.  పసిడి రేటు  మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు మాంద్యం అంచుకు చేరుకుండటం లాంటి కారణాలతో బంగారం ధర పెరుగుతోంది. ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తుండటంతో గోల్డ్‌కు డిమాండ్ పెరిగింది. ఫలితంగా ధరలు పైపైకి దూసుకెళ్తున్నాయి.  భవిష్యత్‌లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర  50వేల మార్కును  తాకే అవకాశం ఉందని  మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి బంగారం ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకి చేరుకున్నాయి. బంగారంపై పెట్టుబడులకు ట్రేడర్లు మొగ్గుచూపడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: