భారత్ లో కరోనా కేసులు లక్ష దాటేశాయి. మహమ్మారి బారినపడి మరణించినవారి సంఖ్య  3 వేలు దాటింది.  దేశంలోనే మహారాష్ట్ర వైరస్ హాట్ స్పాట్ గా మారింది. తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలోనూ పాజిటివ్ కేసులు అంతకంతూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

 

కొద్దిరోజుల క్రితం వరకూ భారత్ లో కరోనా కేసులు ఇతర దేశాలతో పోల్చుకుంటే.. చాలా చాలా తక్కువ. కానీ మహమ్మారి మనల్ని కూడా వదిలిపెట్టలేదు. ఇప్పుడు  ఇండియాకూ  ఆ స్థితికి వ‌చ్చేసింది. మొన్న వైరస్ పుట్టిన చైనా ను దాటేశాం. ఇప్పుడు  ల‌క్ష మార్కును టచ్ చేశాం.  కొన్ని రోజులుగా భారత్ లో స‌గ‌టున రోజుకు 3 నుంచి 4 వేల కేసులు న‌మోద‌వుతూ వస్తున్నాయి. ఆదివారం నాటికి దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 96 వేల మార్కును దాటింది. సోమ‌వారం అన్ని రాష్ట్రాల్లో క‌లిపి కేసుల సంఖ్య 4 వేలు దాటిపోయింది. దీంతో ఇండియా ల‌క్ష క‌రోనా కేసుల మార్కును ట‌చ్ చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ల‌క్ష ప్ల‌స్ క‌రోనా కేసులు న‌మోదైన 11వ దేశం భార‌త్.

 

దేశంలో అత్య‌ధిక క‌రోనా కేసులున్న రాష్ట్రం మ‌హారాష్ట్ర‌నే. మొత్తం ఇండియా కేసుల్లో మూడో వంతుకు పైగా ఇక్క‌డే ఉన్నాయి. అక్క‌డ కేసుల సంఖ్య 35 వేల‌ను దాటేసింది. సోమ‌వారం ఒక్క‌రోజే 2 వేల‌కు పైగా కేసులు ఆ రాష్ట్రంలో న‌మోద‌య్యాయి. మరో 51 మంది మరణించారు. ముంబయిలో కరోనా కేసుల సంఖ్య 20 వేలకు చేరువలో ఉంది.

 

మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో  తమిళనాడు,  గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఉన్నాయి.  త‌మిళ‌నాడులో క‌రోనా ఉద్ధృతి బాగా క‌నిపిస్తోంది. అక్క‌డ కేసుల సంఖ్య 12 వేల మార్కును ట‌చ్ చేసింది. సోమ‌వారం 600 దాకా కేసులు న‌మోద‌య్యాయి. గుజ‌రాత్ సైతం దాదాపు 12 వేల కేసుల‌తో కొన‌సాగుతోంది.

 

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేసేందుకు ఈ నెలాఖరు వరకు కొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం పొడిగించిన వేళ కర్ణాటక సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మే 31 వరకు నాలుగు రాష్ట్రాల నుంచి దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులను తమ రాష్ట్రంలోకి అనుమతించబోమని స్పష్టంచేసింది. మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కేరళ నుంచి తమ రాష్ట్రానికి ప్రయాణికుల రాకను నిరాకరిస్తామని తెలిపింది. ఇప్పటివరకు కర్ణాటకలో 12 వందలకు పైగా కేసులు నమోదు కాగా.. సుమారు 30మంది ప్రాణాలు కోల్పోయారు.

 

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా దేశవ్యాప్తంగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని దుకాణాలు తెరుచుకున్నాయి.  ప్రజా రవాణా వ్యవస్థలు కూడా చాలా ప్రాంతాల్లో రీఓపెన్ అయ్యాయి. జాగ్రత్తలు పాటించకుంటే మరింత ప్రమాదకర స్థితి తలెత్తే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: