ఏపీ విద్యార్థులకు శుభవార్త. ఆగస్టు మూడు నుంచి విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. నాడు-నేడు కార్యక్రమంలో పాఠశాలల అభినృద్ధిపై సీఎం జగన్... ఆరా తీశారు. మరోవైపు.. మరిన్ని విద్యా సంస్కరణలు అమలు చేసే దిశగా.. రాష్ట్ర విద్యాశాఖ అడుగులేస్తోంది.

 

కరోనాతో మూతపడిన విద్యాసంస్థల పునఃప్రారంభానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆగస్టు మూడు నుంచి విద్యాసంవత్సరం ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించారు. జులై నెలాఖరులోగా మొదటి విడత చేపట్టిన 15 వేల 715 స్కూళ్లలో నాడు-నేడు కింద అభివృద్ది పనులు పూర్తి చేయాలని సూచించారు.  నాడు-నేడు కార్యక్రమంపై సమీక్షలో భాగంగా పాఠశాలల అభివృద్ధిపై జగన్‌ ఆరా తీశారు.

 

ప్రతీ పాఠశాలలో 9 రకాల సదుపాయాలను కల్పించాల్సి ఉందన్నారు సీఎం జగన్. దీనికి  సంబంధించి 456 కోట్ల రూపాయల రివాల్వింగ్‌ ఫండ్‌  విడుదల చేశామన్నారు. జులై నెలాఖరు కల్లా అన్ని స్కూళ్లలో పనులు పూర్తి చేసే విధంగా.. జిల్లా  కలెక్టర్లు  ప్రతిరోజూ సమీక్ష చేయాలని సూచించారు. మరోవైపు పాఠశాలల అభివృధి పనుల కోసం... సిమెంటు, ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

 

విద్యా సంస్కరణల దిశగా సీఎం జగన్ .. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ స్కూల్స్ ఏర్పాటు చేసే విధంగా కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. సమగ్ర శిక్ష అభియాన్‌ కింద 3 వేల 400 పాఠ‌శాల‌ల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిధ్దం చేస్తున్నారు..ఇందులో భాగంగా ప్రీస్కూల్స్ కు అవసరమయ్యే సిలబస్ రూపకల్పనపై దృష్టి సారించారు.నాలుగున్నరేళ్లు, ఐదేళ్ల పిల్లలకు ప్రీస్కూల్స్ లో అడ్మిషన్లు కల్పిస్తారు. పిల్లల్లోని ప్రత్యేక నైపుణ్యాన్ని వెలికితీయడం, గణితశాస్త్రంతో పాటు ప్రధాన పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలపై వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.తొలి విడత‌గా‌ గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో ప్రీ స్కూల్స్ ఏర్పాటుకు  ప్రాధాన్యం ఇస్తారు.. తర్వాత ప్రభుత్వ అనుమతితో రాష్ట్రంలోని అన్నిపాఠశాలల్లో  ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ  ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: