ఏపీలో ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా జగన్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు గ్యాప్ లేకుండా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. విద్యుత్ బిల్లుల పెంపు, మద్యం అమ్మకాలు, భూములు అమ్మకాలు, ఇళ్ల పట్టాలు ఇలా ప్రతి అంశంపై వారూ విమర్శలు గుప్పిస్తున్నారు.

 

ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు కూడా జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అసలు ఉమ్మడి ఏపీ నుంచి చూసుకుంటే ఇంత పెద్ద ఎత్తున షాకులిచ్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు. మందు బాబులకు రేట్లు పెంచుతూ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారని, భూములను అమ్ముకోవడం దారుణాతి దారుణమని, సామాన్యుడికి కరెంట్ షాక్ అని, చివరికి రూ. 5 భోజనం దొరికే అన్నా క్యాంటిన్లు మూసివేసి షాకిచ్చారన్నారు. కరోనా సమయంలో ఆ క్యాంటిన్లు ఉంటే బాగా ఉపయోగపడేవని, కనీసం జగనన్న క్యాంటిన్లు అని పేరుమార్చి నడిపితే మంచిందని సలహా ఇచ్చారు.

 

అయితే అన్నా క్యాంటీన్లు పెట్టింది గత చంద్రబాబు ప్రభుత్వం. జగన్ అధికారంలోకి రాగానే వాటిని మూయించేశారు. కనీసం వాటిని ఓపెన్ చేస్తే పేద ప్రజలకు మేలు జరుగుతుందనే వాదన ఎప్పటి నుంచో వస్తుంది. ఇప్పుడు అదే విషయం విష్ణు కూడా చెప్పారు. అయితే విష్ణు జగన్ పై ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు విమర్శలు చేయలేదు. కానీ ఇప్పుడు తీవ్ర విమర్శలు చేసి, బాబు స్కీమ్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

ఇలా సడన్‌గా విష్ణు మాట్లాడటానికే ఏమన్నా కారణం ఉందా అనే అంశాన్ని పరిశీలిస్తే, ప్రస్తుతానికైతే పెద్ద కారణం లేదనే చెప్పుకోవచ్చు. కానీ విష్ణు 2014 ఎన్నికల్లో టీడీపీ పొత్తులో భాగంగా విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయడంతో ఓడిపోయారు. కానీ చెప్పుకోదగిన ఓట్లే తెచ్చుకున్నారు. అయితే ఈయన బీజేపీలో ఉంటే గెలుపు అసాధ్యం. కాబట్టి టీడీపీలోకి రావాలని మొన్న ఎన్నికల్లో ట్రై చేసినట్లు తెలిసింది.

 

కానీ అక్కడికి గంటా శ్రీనివాసరావు వచ్చి పోటీ చేసి గెలిచారు. వచ్చే ఎన్నికల్లో గంటా టీడీపీలో ఉన్నాలేకపోయినా, విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేయడం కష్టమని తెలుస్తోంది. దీంతో విష్ణు టీడీపీలోకి వచ్చి ఆ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం లేకపోలేదు. కాబట్టి విష్ణు మాటల్లో ఆంతర్యం ఏమిటనేది భవిష్యత్ లో తెలియనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: