విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థకు పర్మిషన్స్ ఎవరు ఇచ్చారనేదానిపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య సవాళ్ళ పర్వం నడుస్తోంది. అసలు ఈ సంస్థకు పర్మిషన్ ఇచ్చింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమని, అలాగే తాము ఆ సంస్థకు ఒక్క ఎకరా కూడా కేటాయించలేదని చంద్రబాబు చెబుతున్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వం వచ్చాక దీని విస్తరణకు అనుమతి ఇచ్చారని బాబు ఆరోపిస్తున్నారు. అయితే ఎప్పుడు పెద్దగా విమర్శలపై స్పందించని సీఎం జగన్, ఈ అంశంపై  స్పందించారు.

 

అసలు ఎల్జీ పాలిమర్స్ సంస్థకు చెందిన ఒక్క పర్మిషన్ అంటే ఒక్క పర్మిషన్ తాము ఇవ్వలేదని జగన్ చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వమే పలు అనుమతులు ఇచ్చిందని వివరించారు. ఇక జగన్ విమర్శలు చేయడంతో చంద్రబాబు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు. ఎల్జీ పాలిమర్స్ కేటగిరి మార్పు వెనుక వైసీపీ హస్తం లేదా? అని ప్రశ్నించారు. తన అబద్ధాలతో సీఎం పదవిని జగన్‌ దిగజారుస్తున్నారని, టీడీపీ హయాంలో ఎల్జీ పాలిమర్స్‌కు ఒక్క ఎకరా కేటాయించలేదని, మాజీ సీఎంలు రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌ హయాంలో 4 సార్లు పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చారని గుర్తుచేశారు.

 

అటు పాలిస్టైరీన్ ఉత్పత్తుల విస్తరణకు టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, కంపెనీకి ఏయే ప్రభుత్వాలు ఎలాంటి అనుమతులు ఇచ్చాయో ఆధారాలు ఉన్నాయని, చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ కూడా చేశారు. అయితే అయిపోయిన వాటికి ఛాలెంజ్‌లు, చర్చలు ఎందుకని పలువురు మేధావులు అంటున్నారు. అసలు ఎల్జీ పాలిమర్స్ సంస్థ వల్ల భవిష్యత్‌లో ఎలాంటి ప్రమాదం లేకుండా అక్కడి ప్రజలకు అండగా ఉండాలని, ఆ విషయం వదిలేసి అధికార, ప్రతిపక్షాలు కంపెనీ పర్మిషన్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అని చెబుతున్నారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులు కోరుకునేది ఎవరు పర్మిషన్ ఇచ్చారనేది కాదని, కంపెనీని అక్కడ నుంచి తరలించడం కోరుకుంటున్నారని, కాబట్టి ప్రభుత్వం ఆ పని దృష్టిపెడితే మంచిదేమో అంటున్నారు. మరి చూడాలి బాబు ఛాలెంజ్‌పై జగన్ ఎలా స్పందిస్తారో?  

మరింత సమాచారం తెలుసుకోండి: