పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచుతూ జగన్ సర్కారు విడుదల చేసిన జీవో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలకు ఆస్కారం కల్పించింది. రెండు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా ఇది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం చెప్పడం.. ఈ మేరకు కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడం కూడా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు జగన్ కు అనుకోని షాక్ తగిలింది.

 

 

కృష్ణా జలాల విషయంలో ఏపీ సర్కారు ఇప్పటికే తమకు కేటాయించిన నీటిని వాడుకుందని.. కృష్ణా బోర్డు అంటోంది. అందువల్ల ఇకపై కృష్ణా జలాలను వాడుకోవద్దని ఏపీ సర్కారుకు కృష్ణా బోర్డు లేఖ రాసినట్టు తెలుస్తోంది. మే నెల లో కృష్ణా బోర్డు కేటాయించిన నీటిని ఇప్పటికే వాడుకున్నారని, కేటాయించిన నీటికన్నా ఎక్కువ వాడారని బోర్డు కార్యదర్శి ఏపి ప్రభుత్వానికి లేఖ రాశారు. అందువల్ల సాగర్ కుడికాల్వ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి విడుదల నిలిపివేయాలని కృష్ణాబోర్డు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

 

 

నీటి విడుదలకు సంబంధించి ఉత్తర్వులను విధిగా పాటించాలని కృష్ణా బోర్డు ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వరాదని బోర్డు తెలిపింది. రుతుపవనాలు ప్రారంభమయ్యే వరకు తాగునీటి అవసరాల కోసం మిగిలిన నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుందని బోర్డు అంటోంది. ఓవైపు కేసీఆర్ సర్కారుతో కృష్ణా జలాలపై విబేధాల నేపత్యంలో కృష్ణాబోర్డు ఇలా ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయడం సంచలనమే అని చెప్పాలి.

 

 

ఒక విధంగా ఈ లేఖ ఏపీ సర్కారు చురుకుదనానికి నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే కేటాయించిన జలాలలను చక చకా వాడుకోవడం లో ఏపీ సర్కారు బాగా శ్రద్ధ చూపించింది. కానీ.. సరైన లెక్కల ప్రకారం వాడుకోకపోతే ముందు ముందు ఇబ్బందిపడే అవకాశమూ ఉంది. మరి కృష్ణాబోర్డు లేఖపై ఏపీ ఏమని స్పందిస్తుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: