తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల మ‌ధ్య నీటి పంప‌కంతో ప్ర‌చ్చ‌న్న యుద్ధం మొద‌లైన సంగ‌తి తెలిసిందే.  పోతిరెడ్డిపాడు జీవో కేంద్రంగా.. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు వివిధ వేదికలపై పోరాడుతున్న నేపథ్యంలో ఈ ప్రచారం తెర‌మీద‌కు వ‌చ్చింది. అయితే, దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్వ‌యంగా క్లారిటీ ఇచ్చారు. `మేం ఇద్దరం కలిసే ఉన్నాం. వివాదాల్లేవ్‌. అందుకే కొందరి క‌ళ్లు మండుతున్నయ్‌‌. మేం అన్యోన్యంగా కలిసే ఉంటం. మీరు కిరికిరి పంచాయతీలు పెట్టాలని చూసినా అది జరిగేది కాదు`` అని తేల్చిచెప్పేశారు. దీంతో ప‌రిణామాలు చ‌కచ‌కా మారుతున్నాయ‌ని అంటున్నారు. నదీజలాలే ప్రధాన అంశంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్మోహన్‌రెడ్డిలు మరోసారి భేటీ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

 

ఏపీ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు ఉన్న స‌మ‌యంలో ఆంధ్రప్రదేశ్- ‌ తెలంగాణ జల వివాదాలు పెద్ద ఎత్తున్నే సాగాయి. అపెక్స్‌ కౌన్సిల్‌, సుప్రీంకోర్టు దాకా చేరాయి.  ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీకి జగన్‌ సీఎం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగంగానే కోరుకున్నారు. జగన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కూడా కేసీఆర్‌ వెళ్ళారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి మారింది. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహసంబంధాలు మెరుగుపడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వైఎస్‌ జగన్‌ వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే కట్టారని.. తాను వెళ్ళినా ప్రారంభిస్తారు.. వెళ్ళకపోయినా ప్రారంభిస్తారు. అందుకే.. స్నేహసంబంధాల కోసం వెళ్ళాను అని జగన్‌ దీనిపై అసెంబ్లీ సాక్షిగానే వివరణ ఇచ్చారు.

 

ఇలా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య గత ఏడాది కాలంలో స్నేహసంబంధాలు మరింత బలపడ్డ త‌రుణంలో మ‌ళ్లీ వివాదాల ఊబిలో కూరుకుపోవ‌డం ఎందుకనే ఉద్దేశంతో ఇరువురు అధినేతలు భేటీ జరిగే అవకాశాలు కనబడతున్నాయి. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ఈ భేటీ జరుగుతుందని ఉన్నతస్థాయి వర్గాలలో చర్చ జరుగుతోంది. జూన్‌ మొదటి వారంలో ఈ భేటీ ఉండొచ్చని ప్రచారం ఉంది. తాజా మీడియా సమావేశంలోనే మొత్తం కృష్ణా, గోదావరిలో నీటి లభ్యత.. ఇరు రాష్ట్రాల అవసరాల ప్రాతిపదికగా ముందుకు వెళ్దామని కేసీఆర్‌ ప్రతిపాదించారు. త్వరలో జరిగే సీఎంల భేటీలోనూ.. పోతిరెడ్డిపాడుకు సంబంధించి ఇదేవిధమైన చర్చ జరిగే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: