క‌రోనా క‌ల‌క‌లం నేప‌థ్యంలో విధించిన లాక్ డౌన్ నిబంధ‌న‌లు స‌డ‌లిస్తూ ప‌లు రకాలైన సేవ‌ల‌కు అనుమ‌తి ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అంద‌రి చూపు కీల‌క‌మైన ప్ర‌జా ర‌వాణపై ప‌డింది. ఇప్ప‌టికే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సేవ‌లు ప్రారంభం కాగా, ఏపీలో నేడ రేపో ప్రారంభం కానున్నాయి. దేశంలోని చిన్న పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్న వారికి భారతీయ రైల్వే ఊరట కలిగించింది. వచ్చే నెల ఒకటి నుంచి 200 ప్రత్యేక ప్యాసింజర్‌ రైళ్లను నడుపబోతున్నట్టు ప్రకటించింది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ సేవ‌లు ఉంటాయ‌నే ఆస‌క్తి నెల‌కొంది.

 


రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్  ఈ మేర‌కు వివ‌రాలు వెల్ల‌డించారు. నాన్‌-ఏసీ, రెండో తరగతి కోచ్‌లు గల ఈ రైళ్లను రోజూ నడుపబోతున్నట్టు వివరించారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకునేందుకు ప్రయాణికులకు త్వరలోనే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. టికెట్‌ ధరలు కూడా సాధారణ స్లీపర్‌ క్లాసు ధరలే ఉంటాయని వెల్లడించింది. ‌అయితే, ఏయే నగరాలను కలుపుతూ ఈ రైళ్లను నడుపబోతున్నారన్న విషయాన్ని మంత్రి వెల్లడించలేదు. అధికార వ‌ర్గాల స‌మాచారం, చిన్న పట్టణాలు, నగరాలను కలుపుతూ  రైళ్లను నడుపబోతున్నారు. ఈ ప్ర‌కారం, తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్‌, విజ‌య‌వాడ, విశాఖ‌ప‌ట్ట‌ణం న‌గ‌రాల‌ను క‌లిపేలా రైళ్ల సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి. త్వ‌ర‌లో ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. కాగా, రైల్వే సేవ‌లు అందుబాటులోకి వ‌స్తుండ‌టంతో క‌రోనా కేసుల వ్యాప్తి మ‌రింత పెర‌గ‌నుంద‌నే ఆందోళ‌న ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

 

 

ఇదిలాఉండ‌గా, శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లలో వెళ్లలేకపోయిన వలస కార్మికుల జాబితాల్ని అందిస్తే ప్రత్యేక రెళ్లను ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తామని ఆయా రాష్ర్టాలకు రైల్వే శాఖ మరో ప్రకటనలో సూచించింది. వచ్చే రెండు రోజుల్లో శ్రామిక్‌ ప్రత్యేక రైళ్ల సంఖ్యను రెట్టింపు చేయనున్నట్టు వెల్లడించింది. రోజుకు 400 చొప్పున శ్రామిక్‌ రెళ్లను నడుపనున్నట్టు వివరించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: