నియంత్రిత పంటల సాగుపై దృష్టి పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై విధివిధానాలు ఖరారు చేసేందుకు రేపు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు సంఘం అధికారులతో నేరుగా చర్చించి జిల్లాల వారీగా సాగు చేయాల్సిన పంటలపై చర్చిస్తారు.  

 

తెలంగాణలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. జిల్లాల వారీగా ఏ పంట ఎంత వేయాలి? వాటిలో ఏ రకం విత్తనం ఎక్కడ ఎంత వేయాలి? అనే విషయాలను ఖరారు చేసేందుకు  వ్యవసాయశాఖ సమావేశాలు జరుపుతోంది.  జిల్లాల వారీగా పంటల మ్యాప్ ను రూపొందిస్తోంది. దీని పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రేపు జరిగే సమావేశంలో చర్చించి, ఎక్కడ ఏ పంట వేయాలో నిర్ణయించి ప్రకటించే అవకాశం ఉంది.

 

వానాకాలంలో కంది, పత్తి పంటలు ఎక్కువగా సాగు చేయాలని, యాసంగిలోనే మొక్కజొన్న సాగు చేయాలని ఇప్పటికే వ్యవసాయ శాఖ రైతులకు సూచించింది. 10 లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా సాగుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించింది.  సర్కార్‌ చెప్పిన పంటలే సాగు చేస్తూ.. పంట వేయడం నుంచి మొదలుకొని అమ్ముకునే వరకు ప్రభుత్వ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.

 

నియంత్రతి పద్ధతుల్లో పంటలు సాగుచేసేందుకు రైతులు ముందుకు రావాలని ఇప్పటికే పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. ఈ ఖరీఫ్ నుంచే కొత్త పంటల సాగు విధానం ప్రారంభమవుతుందన్నారు. అందరూ ఒకే పంట వేసి ఇబ్బంది పడేకంటే మార్కెట్లో డిమండ్‌ ఉండే పంటలు పండిస్తే మంచి ధరలు పొందవచ్చన్నారు. గ్రామాల్లో రైతుల వద్దకు వెళ్లి మద్దతు ధరకు ప్రభుత్వమే కొంటుందని స్పష్టం చేశారు.

 

వానాకాలంలో కోటీ 35 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమగ్ర, నియంత్రిత వ్యవసాయంపై దృష్టి సారించారని, ఈమేరకు ఓ విధానం రూపొందించేలా కార్యాచరణకు శ్రీకారం చుట్టారని వ్యవసాయశాఖ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: