కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరును భారీ శబ్దాలు భయాందోళనకు గురి చేశాయి. ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వింత శబ్దాలతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హెబ్బాల్, వైట్ ఫీల్డ్, హెచ్.ఎస్.ఆర్ లే ఔట్, సర్జాపూర్ ప్రాంతాల్లో ఈరోజు మధ్యాహ్నం వింత శబ్దాలు వినిపించాయి. అకస్మాత్తుగా వింత శబ్దాలు రావడంతో నగరవాసులు భూకంపం వచ్చిందని భావించారు. 
 
కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెంటర్ (కేఎస్ఎన్ఎండీసీ) భూకంపం వచ్చిందని జరుగుతున్న ప్రచారం గురించి స్పందించింది. సెస్మోమీటర్లలో భూప్రకంపనలేవీ నమోదు కాలేదని ఆ శబ్దాలు గుర్తు తెలియని శబ్దాలని ప్రకటించింది. ఆ శబ్దాలు రావడానికి అసలు కారణాలు తెలియాల్సి ఉంది. కేఎస్ఎన్ఎండీసీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి భూకంపం వస్తే ఒక ప్రాంతానికే పరిమితం కాదని అన్నారు. 
 
సెన్సార్లను పరిశీలించామని నగరంలో భూకంపం వచ్చినట్టు తేలలేదని చెప్పారు. ఫైటర్ జెట్లు వెళ్లడం వల్ల వింత శబ్దాలు వచ్చి ఉండవచ్చని నగరవాసులు భావిస్తున్నారు. కొందరేమో గ్రహాంతరవాసులు వచ్చారేమోనంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం. కొందరు సోషల్ మీడియాలో తాము తీవ్ర భయాందోళనకు గురయ్యామని... గతంలో అలాంటి శబ్దాలను తాము వినలేదని చెబుతున్నారు. 
 
ఇళల్లో ఉన్న ప్రజలు ఆ శబ్దాలేంటో అర్థం కాక రోడ్లపైకి వచ్చారు. ఫ్లైట్లు లేదా సూపర్ సోనిక్ శబ్దాలేమో అని నిర్ధారించుకోవడం కోసం పోలీసులు ఎయిర్ ఫోర్స్ కంట్రోల్ రూంను ఇప్పటికే సంప్రదించారు. వారి నుంచి సమాధానం అందాల్సి ఉంది. అయితే పోలీస్ కంట్రోల్ రూంకు ఎవరూ ఫోన్ చేయలేదని పోలీసులు చెబుతున్నారు. మరికొన్ని గంటల్లో ఈ వింత శబ్దాలకు గల కారణాలు తెలిస్తే అవకాశం ఉంది. ప్రభుత్వం లేదా ఉన్నతాధికారులు ఈ విషయం గురించి స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది.                  

మరింత సమాచారం తెలుసుకోండి: