తెల్లారింది మొదలు.. రాత్రి నిద్రపోయేంత వరకూ కరోనా కారణంగా ముఖానికి మాస్కులను ధరించడం తప్పనిసరైంది. మాస్క్‌లు ధరించడం మనకు అలవాటైంది. ఒక్కొక్కరు ఒక్కో రకం మాస్క్‌ను ధరిస్తుండగా.. ఉన్నతస్థాయివర్గాల కోసం వెండి మాస్క్‌లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. వీటిని ధరించడం చాలా మందికి తలనొప్పిగా తయారైంది. ఒక పొర, రెండు పొరలు, వస్త్రంతో తయారుచేసినవి, వైద్య సిబ్బంది వాడేవి.. ఇలా ఎన్నో రకాల మాస్క్‌లు దర్శనమిస్తున్నాయి. మిగతా సమయాల్లో ఎలాగున్నా.. హోటళ్లలో, ఆఫీసుల్లో నీళ్లు తాగేప్పుడు, తినేటప్పుడు మాస్కుల్ని తీయడం, మళ్లీ పెట్టుకోవడం కొంచం కష్టంగా మారింది. అయితే, ఓ ఊహించ‌ని మాస్క్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వ‌చ్చింది.

 

మాస్కు క‌ష్టాల‌కు ఇజ్రాయెల్‌ ఆవిష్కర్తలు ఓ పరిష్కారాన్ని  కనిపెట్టారు. ఆహారం లేదా పానీయాన్ని చెయ్యి లేదా స్పూన్‌తో నోటి దగ్గరికి తీసుకువచ్చి.. రిమోట్‌ను ఆపరేట్‌ చేస్తే మాస్కు తెరుచుకుంటుంది.  ఓ వినూత్న మాస్కును ‘అఫప్టిపస్‌ పేటెంట్స్‌ అండ్‌ ఇన్వెన్షన్స్‌' అనే సంస్థ తయారు చేసింది. ఈ మాస్క్‌ ధర 0.85 - 2.85 డాలర్లు  ఉంటుందని ఆవిష్కర్తలు చెప్పారు.

 

కాగా, ప్రపంచానికి కరోనా వైరస్‌ను పరిచయం చేసిన చైనాలో కొన్ని నెలలపాటు మాస్క్‌లు ధరించడం అక్కడి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దాంతో మాస్క్‌ల జాగ్రత్తపై పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారమార్గంగా తనకు తానుగా శుభ్రం చేసుకొనే మాస్క్‌లను తీసుకొస్తే ఎలా ఉంటుందని ఆలోచించి తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది చైనాకు చెందిన స్టార్టప్ సంస్థ హువామి. ఎన్‌-95 మాస్క్‌ను చేతులతో శుభ్రం చేసుకోవాల్సి ఉండగా.. ఈ మాస్క్‌లో మాత్రం అల్ట్రావయోలెట్‌ లైట్లే ఆ పనిని కానిస్తాయి. యూఎస్‌బీ పోర్ట్‌ ద్వారా విద్యుత్‌ సరఫరాకు అనుసంధానించగానే ఈ మాస్క్‌లోని అంతర్నిర్మిత అతినీలలోహిత లైట్లు 10 నిమిషాల వ్యవధిలో మాస్క్‌లోని సూక్ష్మక్రిములను నాశనం చేస్తుందని హువామి వెల్లడించింది. ఈ మాస్క్‌లను కరోనాలాంటి వైరస్‌లు వ్యాప్తిచెందకుండానే కాకుండా నిత్యం కాలుష్యం నుంచి మనల్ని మనం బయటపడేందుకు కూడా వినియోగించుకోవచ్చని హువామే పేర్కొంటోంది. మొత్తంగా మాస్కులు మ‌నం జీవితంలో భాగం కావ‌డ‌మే కాకుండా ఇలా కొత్త కొత్త టెక్నాల‌జీతో కూడా అందుబాటులోకి వ‌చ్చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: