కరోనా..! ఈ పేరు వింటేనే ప్రపంచదేశాలన్నీ హడలిపోతున్నాయి. కరోనా కట్టడి కోసం ఎంతగానో కృషి చేస్తున్నాయి. వైరస్‌పై నిరంతరం పోరాటం చేస్తున్న రియల్‌ వారియర్స్ డాక్టర్లను ప్రతి ఒక్క దేశం గౌరవిస్తున్నాయి. కానీ ఆ దేశంలో మాత్రం వైద్యులకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదు. దీంతో డాక్టర్లు ఆ దేశ ప్రధానికే  విన్నూత రీతిలో నిరసన తెలిపి షాక్‌ ఇచ్చారు. 

 

కరోనా మానావళి నుదుటి మీద రాస్తున్న మరణ శాసనానికి ఇంకా పుల్‌స్టాప్‌ పడలేదు. ఈ మహమ్మారి 213 దేశాలను చుట్టేసింది. ఈ వైరస్‌ దెబ్బకి ధనిక, పేద అన్ని దేశాలు అల్లాడిపోతున్నాయి. యూరప్‌ దేశాల్లో ఒక్కటైన బెల్జియంలో కూడా కరోనా విజృంభిస్తోంది. బెల్జియంలో 55 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 9 వేల మంది కరోనా కాటుకు బలయ్యారు. ఆ దేశంలో ఈ వైరస్‌ మెడలు వంచడానికి డాక్టర్లు నిరంతరం కృషి చేస్తున్నారు. 

 

కరోనా కాలంలోనూ నిర్విరామంగా విధలు నిర్వరిస్తున్న అలాంటి వైద్యులకు ఏమిచ్చినా తక్కువే. కానీ బెల్జియంలో మాత్రం వైద్యులకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదు. దీంతో ప్రభుత్వ విధానాలతో  విసిగిపోయిన వైద్యులు ఆ దేశ ప్రధానికి వినూత్న నిరసన తెలిపి షాక్‌ ఇచ్చారు.  బెల్జియం ప్రధాని సోఫీ విల్మ్స్‌ బ్రస్సెల్స్‌లోని ఆస్పత్రిని సందర్శించేందుకు వెళ్లారు. అప్పుడు అక్కడి వైద్యులు సహా సిబ్బంది రోడ్డుకి ఇరువైపులా నిల్చొని ఉన్నారు. ఘనస్వాగతం కోసం అనుకుంటే తప్పులో కాలేసినట్లే..! ప్రధాని విల్మ్స్‌ విధానాలను వ్యతిరేకిస్తూ ఆమెకు తమ వీపులు చూపిస్తూ  నిలబడ్డారు.

 

వైద్య సిబ్బంది ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో వైద్య సిబ్బందికి తగినంతగా నిధులు కేటాయించలేదు. నిధుల కేటాయింపు పక్కన పెడితే.. వేతనాల్లో కోత విధించారు. మరోవైపు ఎలాంటి అర్హత లేనివారిని ప్రభుత్వం నర్సులుగా నియమించింది. దీంతో తమ వ్యతిరేకతను దేశాధ్యక్షురాలికి తెలియజెప్పేందుకు ఇలా వినూత్నంగా నిరసన తెలిపారు. ఇప్పుడు ఈ వీడియోలో సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: