దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. గత మూడు రోజుల నుంచి దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజు 5000కు పైగా కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. కరోనా వైరస్ పుట్టిన చైనాను మించి భారత్ లో కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో వైరస్ ప్రభావిత టాప్ 10 దేశాల్లో భారత్ చేరింది. 
 
మే 7వ తేదీ నుంచి ప్రతిరోజూ 3200కు పైగా కేసులు దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతూ ఉండగా గత నాలుగు రోజులుగా 5000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజులోనే ఏకంగా 5611 కేసులు నమోదయ్యాయి. అయితే ఇదే సమయంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ మీడియాకు ముఖం చాటేస్తోంది. గతంలో ప్రతిరోజూ మీడియాకు కేసుల పరిస్థితిని వివరించే ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత కొన్ని రోజుల నుంచి సైలెంట్ అయింది. 
 
ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత ఎనిమిది రోజులుగా ఒక్క మీడియా సమావేశాన్ని నిర్వహించటం లేదు. కేసుల సంఖ్య పెరగడం వల్లే ఆరోగ్య మంత్రిత్వ శాఖ మీడియాకు ముఖం చాటేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తున్నా మీడియాతో నేరుగా ఎందుకు ఆరోగ్య శాఖ వివరణ ఇవ్వలేదు. కేంద్రం ఆదేశాల మేరకే ఆరోగ్య శాఖ సమావేశాలు నిర్వహించడం లేదని ప్రచారం జరుగుతోంది. 
 
మే 11 నుంచి 20 మధ్య దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 57 శాతం పెరిగింది. కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు రోజూ ముఖాముఖి నిర్వహించింది. మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చింది. కానీ కేసులు పెరుగుతున్న తరుణంలో ఆరోగ్య శాఖ మీడియాకు ఎందుకు ముఖం చాటేస్తోందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆరోగ్య శాఖ మీడియాతో మాట్లాడితే విలేకరులు అడిగే ప్రశ్నల ద్వారా ప్రజలకు సందేహాలు నివృత్తి అయ్యే అవకాశం ఉంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: