తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు జ‌గ‌న్‌, కేసీఆర్‌ల‌కు హైకోర్టుల నుంచి షాకుల‌మీద షాకులు ఎదుర‌వుతున్నాయి. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌లు తీసుకుంటున్న ప‌లు నిర్ణ‌యాలు తీవ్ర వివాదాస్ప‌దంగా మారుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎవ‌రో ఒక‌రు హైకోర్టులో పిల్స్ వేయ‌డం.. కోర్టులు ప్ర‌భుత్వాల ప‌నితీరుపై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం జ‌రుగుతూనే ఉంది. తాజాగా.. కరోనా టెస్టులపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గాంధీ, నిమ్స్‌లోనే కరోనా పరీక్షలు చేయించుకోవాలనడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపింది. ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లపై నమ్మకం లేకపోతే... ఆరోగ్యశ్రీ సేవలకు ఎలా అనుమతిచ్చారని ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. కరోనా సేవల కోసం ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు... ఐసీఎంఆర్‌కు దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. ఆస్పత్రులు, ల్యాబ్‌లలో వైద్య సిబ్బంది, సదుపాయాలను... ఐసీఎంఆర్‌ పరిశీలించి నోటిఫై చేయాలని తెలిపింది.

 

ఐసీఎంఆర్‌ ఆమోదించిన ఆస్పత్రుల్లోనే... కరోనా చికిత్సకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా.. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల లాక్‌డౌన్ ఉల్లంఘనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్‌డౌన్ ఉల్లంఘనలకు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారంపై సీబీఐ విచారణకు ఎందుకు అదేశించకూడదని ధర్మాసనం ప్రశ్నించింది. లాక్‌డౌన్ పాటించాలని కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు రూల్స్ అమలు చేయాలని చెబితే ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారే అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేయ‌డం గ‌మ‌నార్హం. ల‌బ్ధిదారులతో మాట్లాడే క్ర‌మంలో భాగంగా ఇది జరిగినట్టు ప్రభుత్వ తరపు న్యాయవాది సుమన్ కోర్టుకు తెలిపారు. ప్రజా ప్రతినిధులైన వారే నిబంధనలు పాటించనవుడు, ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోనపుడు సీబీఐ విచారణ ఎందుకు చేయకూడదని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం తరపున వివరాలు అందజేయటానికి  అడ్వకేట్ జనరల్ సమయం కోరారు. తదుపరి విచారణ వచ్చే వారానికి ధర్మాసనం వాయిదా వేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు హైకోర్టుల నుంచి మొట్టికాయ‌లు ప‌డుతూనే ఉన్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: