జగన్ అపుడే ఏడాది పాలన పూర్తి చేసుకోబోతున్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలి అని నినాదాలు చేసిన వైసీపీ క్యాడర్ గొంతుకలు ఇంకా చెవుల్లో మారుమోగుతున్నాయి. ఇక జగన్ సీఎం ఎప్పటికీ అవడు అంటూ టీడీపీ సహా విపక్షాలు చేసిన సవాళ్ళు  కూడా కళ్ల ముందే ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉండగానే జగన్ సీఎం కుర్చీ ఎక్కేశారు. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్నారు.

 

ఇదిలా ఉండగా తన ఏడాది పాలనపైన జగన్ మేధోమధనం చేపడతారని అంటున్నారు. ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకూ అయిదు రోజుల పాటు సాగే ఈ మేధో మధనంలో జగన్ ఏడాది పాలనపైన చర్చ సాగుతుంది. వ్యవసాయం, మహిళా సంక్షేమం, మద్య పాన నిషేధం వంటి వాటితో పాటు నవరత్నాలు అమలు తీరు వంటివి కూడా చర్చగా ఉంటాయ‌ట.

 

వీటిపైన మేధావులు, తటస్థుల నుంచి అభిప్రాయాలను తీసుకుని రెండవ ఏడాది ఇంకా మెరుగైన పాలన అందించేందుకు జగన్ తయారుగా ఉండేందుకే ఈ సమీక్షలు అంటున్నారు. ఇదిలా ఉండగా నిజానికి జగన్ అధికారంలోకి రావడం ఒక ఎత్తు. అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఏడాదిలోనే తన సత్తా చాటడం వేరు.

 

దాంతో జగన్ ఏడాది పాలన విషయంలో భారీ ఎత్తున ఉత్సవాలకు కూడా క్యాడర్ సిధ్ధంగా ఉంది. అయితే కరోనా కారణంగా ఉత్సవాలు జరుపుకునేందుకు వీలు లేదు. మరి మే 30న జగన్ ఏం చేయబోతారు, నేరుగా ప్రజలతో మీడియా ముఖంగా మాట్లాడుతారా. లేక ఒక బహిరంగ లేఖను విడుదల చేసి ఊరుకుంటారా అన్నది కూడా చర్చగా ఉంది.

 

ఏది ఏమైనా వైసీపీ బంపర్ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి పండుగను మాత్రం జనం మధ్యన జరుపుకోకపోవడం బాధాకరమే. అయితే వైఎస్సార్  రైతు భరోసా కేంద్రాలను తన తొలి ఏడాది పాలన పూర్తి సందర్భంగా జగన్ శ్రీకారం చుడతారని ఇప్పటికైతే ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: