ఏపీ సీఎం జగన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన తరువాత అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జగన్ సర్కార్ చర్యలు చేపడుతోంది. జగన్ కొన్ని రోజుల క్రితం అధికారులకు విశాఖ గ్యాస్ లీకేజీ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. తాజాగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి జగన్ ముందు ఉంచారు. 
 
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణకు గట్టి చట్టం ఆంధ్రప్రదేశ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంప్రూవ్‌మెంట్‌ యాక్ట్‌కు రూపకల్పనకు సంబంధించిన ప్రతిపాదనలను వివరించారు. స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరభ్‌కుమార్‌ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి వివేక్‌ యాదవ్, పులువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. 
 
ఈ యాక్ట్ అమలులోకి వస్తే పరిశ్రమల్లో కాలుష్యం, ప్రమాదకర పదార్థాలపై నిరంతర పర్యవేక్షణ జరుగుతుంది. అధికరులు రియల్‌టైంలో డేటా స్వీకరణతో పాటు నిబంధనలు ఉల్లంఘిస్తే మొదట కంపెనీలకు హెచ్చరికలు జారీ చేస్తారు. పదేపదే నిబందనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటున్నారు. ఈ యాక్ట్ లో ప్రఖ్యాత, విశ్వసనీయ ఏజెన్సీలను థర్డ్ పార్టీ అడిటర్ గా నియమించి పర్యవేక్షణ, సమీక్ష చేయించేలా ప్రతిపాదనలు చేశారు. 
 
నివేదికలను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని... కంపెనీ విధిగా నిర్ణీత కాలానికి ఒకసారి స్వయంగా కాలుష్య నియంత్రణ మండలి సూచనల అమలు మేరకు రిపోర్టు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. నిర్ణీత ప్రమాణాలను దాటి కాలుష్యకారక పరిస్థితులు, ప్రమాదకర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే హెచ్చరికలు జారీ చేయాలని... పర్యావరణానికి జరిగిన హాని ప్రకారం జరిమానాలు విధించాలని సమాచారం. ఈ యాక్ట్ కు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని త్వరలో ఈ యాక్ట్ అమలులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.      

మరింత సమాచారం తెలుసుకోండి: