విశాఖ‌లో జ‌రిగిన ఘోర ప్రమాదం గుర్తుండే ఉంటుంది. ఎల్జీ పాలిమ‌ర్స్ సంస్థ నుంచి విష‌వాయువులు లీక్ అవ‌డం, ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోవ‌డం వంటి అనూహ్య ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ఇదే స‌మ‌యంలో మిగ‌తా ప్రాంతాల్లో ఉన్న ప‌రిశ్ర‌మ‌లపై అంద‌రి దృష్టి ప‌డింది. ఇదే స‌మ‌యంలో స‌హ‌జంగానే హైద‌రాబాద్ చుట్టూ ఉన్న వేలాది కంపెనీల గురించి సైతం ప్ర‌జ‌ల్లో ఉత్కంఠ నెల‌కొంది. ఇలాంటి త‌రుణంలో తెలంగాణ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డ్ టీపీసీబీ మెంబర్‌ సెక్రటరీ నీతూ కుమారి ప్రసాద్ కీల‌క ఆదేశాలు విడుద‌ల చేశారు. జాయింట్‌ చీఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్స్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి రీజనల్‌ ఆఫీసర్స్‌తో సమావేశం నిర్వ‌హించి పరిశ్రమలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఆమె చర్చించారు. 

 

 

ప‌రిశ్ర‌మ‌ల విష‌యంలో కూకట్‌పల్లి, మియాపూర్‌, తెల్లపూర్‌,నాచారం తదితర ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్‌ వాసులు పరిశ్రమల కారణంగా వచ్చే మురుగు వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. జీడిమెట్ల,మల్లాపూర్‌ పారిశ్రామిక ప్రాంతాల్లో నాలాలు వ్యర్థాలతో నిండిపోవడం వల్ల వచ్చే మురుగు వాసనతో జనం అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితిపై తాజా స‌మావేశంలో పీసీబీ మెంబర్‌ సెక్రటరీ నీతూ కుమారి ప్రసాద్‌ ఆరా తీశారు. పరిశ్రమలు నిబంధనలను అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించినట్టుగా ఆమె వివరించారు. పారిశ్రామికవాడల్లో 24 గంటలు అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుకు జవాబుదారీగా ఉండాలని రీజనల్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని ఫార్మా, కెమికల్‌, వాటర్‌ పొల్యూటింగ్‌ ఇండస్ట్రీలు తప్పనిసరిగా ప్రధాన ద్వారం వద్ద పరిసరాలు కవర్‌ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకో వాలని సూచించారు. కాలుష్యానికి సంబంధించి ఫిర్యాదులు చేయాలంటే టోల్‌ ఫ్రీ నంబర్‌ 10471కు ఫోన్‌ చేసి తెలియజేయొచ్చని ఆమె పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం నడుచుకోని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 


ఇదిలాఉండ‌గా, విశాఖ ఎల్జీ సంఘటన తర్వాత ఏపీ సర్కారు అప్రమత్తమైంది. అందులో భాగంగా ప్రమాదం జరగటానికి ఆస్కారం ఉన్న పరిశ్రమలు రాష్ట్రంలో 86 ఉన్నాయని పరిశ్రమల శాఖ గుర్తించింది. ఆయా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు అధికారులు స్వయంగా పరిశీలించిన తర్వాతే పునఃప్రారంభానికి అనుమతించనున్నారు. ప్రమాదం జరగటానికి ఆస్కారం ఉన్న పరిశ్రమల జాబితాలో ఫార్మా, గ్యాస్‌, రసాయనాలు తయారు చేసే భారీ పరిశ్రమలను చేర్చింది. జిల్లాల వారీగా ఆ పరిశ్రమల్లో యంత్రాలు, బాయిలర్లు, రసాయనాలు నిల్వ చేసే ట్యాంకుల వద్ద భద్రతా ప్రమాణాలు పరిశీలించి, వెంట‌నే నివేదిక పంపాలని పరిశ్రమల శాఖ ఆదేశించింది. కంపెనీ భద్రతా విభాగం అధికారులతో కలిసి పరిశ్రమల శాఖ, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, పోలీసుశాఖ తరఫున సభ్యులు వెళ్లి తనిఖీలు ప్రారంభించారు. వీరు పరిశ్రమల యాజమాన్యం నుంచి భద్రతా ప్రమాణాలు పాటించినట్లు కచ్చితమైన హామీ పత్రాన్ని తీసుకోవాలి. భారీ పరిశ్రమల భద్రతా ప్రమాణాలు పరిశీలించాకే పునఃప్రారంభానికి అనుమతించాలని అధికారులు తేల్చిచెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: