ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లని పెంచాలన్నచూసిన జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. మొత్తం రిజర్వేషన్ 50 శాతానికి మించకూడదని సుప్రీం తీర్పు ఇచ్చింది. అంటే బీసీలకు 34 శాతం మాత్రమే అమలు చేయాలనేది సుప్రీం ఉద్దేశం. అయితే వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సరైన వాదన వినిపించకపోవడం వల్లే, బీసీలు ఎక్కువ రిజర్వేషన్ దక్కే అవకాశం కోల్పోయారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

 

జగన్‌ బీసీ ద్రోహి అని, చట్టసభల్లో బీసీలకు ప్రాతినిధ్యం లేకుండా చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక మాజీ సీఎం కిరణ్ హయాంలో 60 శాతం వరకు రిజర్వేషన్లు కల్పించారని, బీసీలకు రిజర్వేషన్‌పై కోర్టులో ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేదని అంటున్నారు. అయితే బీసీలంతా టీడీపీ వెంటే ఉన్నారని జగన్‌కు అక్కసు ఉందని,  వైసీపీ స్వార్థం కోసం బీసీలు బలికావాలా? అని టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తున్నారు.

 

అయితే జగన్ స్థానిక సంస్థల ఎన్నికలో బీసీలకు రిజర్వేషన్లు పెంచి, మొత్తం 59 శాతం వరకు అమలు చేయాలని చూశారు. కానీ దీనిపై హైకోర్టుకు వెళ్లింది టీడీపీకి సంబధించిన బిరు ప్రతాప్ రెడ్డినే. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో, సుప్రీంకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బే తగిలింది. అంటే ఈ బీసీల రిజర్వేషన్లు పెరగకుండా అడ్డుకుంది టీడీపీనే అని స్పష్టంగా అర్ధమవుతుంది.

 

అలా రాజకీయంగా రిజర్వేషన్లు అడ్డుకుని, ఇప్పుడు జగన్ బీసీ ద్రోహి అనడంలో ఎలాంటి అర్ధం లేదు. పైగా బీసీలంతా టీడీపీ వెంటే ఉన్నారని జగన్‌కు అక్కసు అని మాట్లాడుతున్నారు. అసలు బీసీలు టీడీపీ వెంటే ఉంటే, ఎన్నికల్లో విజయం కూడా దక్కించుకోవాలిగా, కానీ జగన్ భారీ మెజారిటీతో గెలిచేశారు. దీని బట్టే అర్ధం చేసుకోవచ్చు, బీసీలు ఎక్కువగా ఎవరి వెంట ఉన్నారో, ఎవరికి అక్కసు ఉందో?

మరింత సమాచారం తెలుసుకోండి: