రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విషయంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే అటు తిరిగి, ఇటు తిరిగి జగన్-కేసీఆర్ జలపంచాయతీలో చివరికి చంద్రబాబు టార్గెట్ అయ్యారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ కోసం తీసుకొచ్చిన ఏపీ సర్కారు తెచ్చిన జీవో 203పై ఓ వైపు న్యాయపోరాటం చేస్తూనే, పొరుగురాష్ట్రంగా సఖ్యత కొనసాగిస్తామని కేసీఆర్ చెప్పారు.

 

ఏపీ సీఎం జగన్ తో కలిసుండటం చూడలేక కొంతమంది కళ్లు మండుతున్నాయా?అని కేసీఆర్ బాబుపై పరోక్షంగా మండిపడ్డారు. అలాగే బాబ్లీ ప్రాజెక్టు కోసం పొరాడి ఏం సాధించారని కూడా బాబుకు చురకలు అంటించారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలకు టీడీపీ నుంచి పెద్దగా కౌంటర్లు రాలేదు గానీ, బాబు మాజీ శిష్యుడు, ప్రస్తుత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నుంచి కౌంటర్లు వచ్చాయి.

 

జగన్ సర్కారు తెచ్చిన జీవో 203, ఇద్దరు సీఎంల నాటకం వెనుక ప్రైవేటు విద్యుత్ సంస్థల లాబీయింగ్ ఉందని జీవో 203 అసలు టార్గెట్ నీళ్లు కాదు, కరెంటే అని రేవంత్ మాట్లాడారు. అసలు భారీ కమిషన్ల కోసమే ఇద్దరు సీఎంలు కూడబలుక్కొని ఈ ప్లాన్‌కు అంగీకరించారని ఆరోపించారు. అయితే కేసీఆర్ పరోక్షంగా చంద్రబాబుని విమర్శించడంపై కూడా రేవంత్ గట్టి కౌంటర్ ఇచ్చారు. నాడు చంద్రబాబుకు చెప్పులు మోసింది, వైఎస్సార్ కు డబ్బు మూటలు మోసింది కూడా కేసీఆరే అని రేవంత్ ఫైర్ అయిపోయారు.

 

అంటే టీడీపీ నేతలు ఇవ్వలేని కౌంటర్లన్ని రేవంత్ ఇచ్చేసినట్లే కనిపిస్తోంది. పైగా ఆయన జగన్‌ని విమర్శిస్తున్న దాని బట్టి చూసుకుంటే బాబు కోసమే అన్నట్లుగా ఉంది. కాకపోతే ఇక్కడ కేసీఆర్ మాత్రం రేవంత్ రెడ్డి లాంటి వారు చేసే విమర్శలని అసలు పట్టించుకోవడం లేదు. అసలు తెలంగాణలో ప్రతిపక్షం లేనట్లుగానే కేసీఆర్ ముందుకెళుతున్నారు. మరి అలాంటప్పుడు రేవంత్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలపై ఎంతవరకు ప్రభావం చూపుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: