హ‌మ్మ‌య్య‌.. భీక‌ర తుఫాన్  ‘అంఫాన్‌' పశ్చిమబెంగాల్‌లో తీరాన్ని దాటింది. భీకర గాలులతో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు పశ్చిమ బెంగాల్‌లోని దిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా ద్వీపం మధ్యనున్న సుందరబన్‌ ప్రాంతానికి దగ్గరగా తుఫాన్‌ తీరాన్ని తాకినట్టు భారత వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. సాయంత్రం 7 గంటలకు తీరాన్ని దాటినట్టు వారు పేర్కొన్నారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో గంటకు 170-200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీశాయి. తుఫాన్‌ వల్ల పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతా, ఉత్తర, దక్షిణ 24 పరగణాలతోపాటు ఒడిశాలోని పూరి, ఖుద్రా, జగత్‌సింగ్‌పూర్‌, కటక్‌, కేంద్రపారా, జాజ్‌పూర్‌, గంజామ్‌, భద్రక్‌, బాలాసోర్‌ తదితర జిల్లాలు తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి. బుధవారం ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో భారీ వృక్షాలు కూడా నేలకొరిగాయి. పెద్ద మొత్తంలో ఇండ్లు ధ్వంసమయ్యాయి.

 

పశ్చిమ బెంగాల్‌లో చెట్లు విరిగిపడిన ఘటనలో ముగ్గురు మరణించారు. అయితే, మృతుల సంఖ్య పది నుంచి పన్నెండు వరకు ఉంటుందని బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. తుఫాన్‌ధాటికి ఒడిశాలో కూడా మరో ఇద్దరు మృతి చెందారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బెంగాల్‌, ఒడిశా తీర ప్రాంతాల్లోని దాదాపు 6.58 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌), ఫెడరల్‌ విపత్తు ప్రతిస్పందన దళానికి చెందిన 41 బృందాల్ని సహాయ చర్యలు నిర్వహించడానికి రెండు రాష్ర్టాల్లో మోహరించారు. తుఫాన్‌ సృష్టిస్తున్న ప్రఛండ గాలులతో పశ్చిమ బెంగాల్‌కు ఆనుకొని ఉన్న సముద్ర జలాల్లోని అలలు ఐదు మీటర్ల ఎత్తుతో ఎగసిపడుతున్నాయని ఐఎండీ డెరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మొహాపాత్ర తెలిపారు. తుఫాన్‌ ప్రభావంతో అసోం, మేఘాలయలో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదన్నారు. మరోవైపు, ‘అంఫాన్‌' తుఫాన్‌ బంగ్లాదేశ్‌ వైపునకు వెళ్లాక తీవ్ర వాయుగుండంగా మారి ఆ తర్వాత బలహీనపడనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: