ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన బస్సు సర్వీసులు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, పల్లె వెలుగు బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని బస్సుల్లో కండక్టర్లు లేకుండా నగదు రహిత లావాదేవీలు జరగనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ రాత్రిపూట కర్ఫ్యూ ఉన్నా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని బస్సులు నడుపుతామని తెలిపారు. 
 
ప్రయాణికులు రాత్రి 7 గంటల లోపే బస్సులు నడపాలని... విశాఖ, విజయవాడ నగరాలలో సిటీ సర్వీసులు నడపటం లేదని తెలిపారు. ఆర్టీసీ ఎండీ ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు శుభవార్త చెప్పారు. అంతర్రాష్ట్ర సర్వీసులు నడపాలని ఆయా రాష్ట్రాలకు అనుమతుల కోసం లేఖలు రాశామని... ఆయా రాష్ట్రాల నుంచి అనుమతులు వస్తే ఇతర రాష్ట్రాలకు బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయని చెప్పారు. 
 
ఛార్జీలు యథాతథంగా ఉంటాయని... రాయితీ ప్రయాణాన్ని తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పారు. ప్రయాణికులు మొబైల్ లో ఆరోగ్య సేతు యాప్ ను తప్పనిసరిగా కలిగి ఉండాలని అన్నారు. టికెట్ ఉన్న ప్రయాణికులకు మాత్రమే బస్టాండ్ లోకి అనుమతి ఉంటుందని తెలిపారు. మెడికల్ ఎమర్జెన్సీ ఐతే మాత్రమే వృద్ధులు, చిన్నారులను బస్సుల్లోకి అనుమతిస్తామని తెలిపారు. 
 
నిన్న సాయంత్రం 4 గంటలకు ఆన్ లైన్ బుకింగ్ ప్రారంభం కాగా ఈరోజు ఉదయం 7 గంటల నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని.... బస్టాండ్ లలో మాస్క్ లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రతి బస్టాండ్ లో శానిటైజర్ సదుపాయాన్ని కల్పించామని... రాష్ట్రంలో 1683 బస్సులతో 17 శాతం సర్వీసులను ప్రారంభించామని తెలిపారు. లాక్ డౌన్ వల్ల ఆర్టీసీకి 1200 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని అన్నారు.              

మరింత సమాచారం తెలుసుకోండి: