నేడు లోకంలో కరోనా లాంటి ప్రమాదకరమైన వ్యాధులతో పాటుగా, అంతకు మించి ప్రమాదకరంగా నేరస్తులు మారుతున్నారు.. ఈ వ్యాధులకు వ్యాక్సిన్ కనుగొంటే తగ్గిపోతాయి.. కానీ నేరాలు జరగకుండా ఏ వ్యాక్సిన్ కనిపెట్టడం సాధ్యపడదు కదా.. అందుకే రోగాలకంటే ప్రమాదకరం మనిషి ఆలోచనలు.. ఆ ఆలోచనల నుండే మనిషిలో మార్పు జరిగి ఊసరవెల్లిలా మారుతున్నాడు.. సమాజాన్ని నమ్మించి నాశనం చేస్తున్నాడు.. ప్రస్తుత పరిస్దితుల్లో సైబర్ నేరగాళ్లు ఇలాగే ప్రవర్తిస్తున్నారు.. ఎందుకంటే వారు చేసే నేరాలకు అంతే ఉండటం లేదు.. కంప్యూటర్ కంటే వేగంగా, వారి ఆలోచనల్లో మార్పు తెచ్చుకుంటూ మోసాలకు ఎగబడుతున్నారు..

 

 

ఇలాంటి వారికి ఎన్ని అడ్డుకట్టలు వేసినా ఆగడం లేదు.. కొత్త దార్లో కొత్త తరహాగా ప్రజలను దోచుకుంటున్నారు.. ఇందులో భాగంగానే కరోనా నేపథ్యాన్ని ఆసరాగా చేసుకొని, డేటా తస్కరణకు కొత్త ఎత్తుగడతో ముందుకొస్తున్నారు. ‘సెర్బెరస్‌’ పేరిట కుయుక్తులు పన్నుతూ, వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి, తద్వారా నగదు కాజేసేందుకు లింక్‌లను పంపిస్తున్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని సీబీఐ హెచ్చరించింది. ఇంటర్‌పోల్‌ హెచ్చరిక మేరకు రాష్ట్రాల పోలీస్‌ విభాగాలను, కేంద్ర నిఘా వ్యవస్థలను అప్రమత్తం చేయడంతో పాటు, పలు సూచనలు చేస్తుంది.. ఇకపోతే హ్యాకర్ల ఫోరంలలో అద్దెకు దొరికే సెర్బెరస్‌ అనే ఆండ్రాయిడ్‌ బ్యాంకింగ్‌ ఈ ట్రోజన్‌ను సున్నిత, రహస్య సమాచారాన్ని తస్కరించేందుకు సృష్టించారు.

 

 

ప్రపంచ దృష్టి ఇప్పుడు కరోనా వైపు ఉన్న తరుణంలో దీన్నో ఆయుధంగా మలుచుకున్నారు సైబర్‌ నేరస్థులు. మీ మొబైల్‌కు కొన్ని లింకులను పంపిస్తారు.. ఆ లింకులు మీకు సహాయ పడేవిగా ఉంటాయని మభ్యపెడతారు.. ఒక వేళ ఇలాంటి లింకులు గనుక ఒపెన్ చేశారంటే మీ సెల్‌ఫోన్‌లోని కీలక సమాచారం సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కినట్లే. వీటి ఆధారంగా ఆన్‌లైన్‌ లావాదేవీల సమయంలో బ్యాంకింగ్‌, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల తాలూకూ సమాచారాన్ని తస్కరించి ఖాతాల్లో నగదు కాజేస్తారు.

 

 

ఇదిలా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా ఈ ట్రోజన్‌ను నేరస్థులు విరివిగా ప్రయోగిస్తున్నారనే సమాచారంతో ఇంటర్‌పోల్‌ అన్ని దేశాలనూ అప్రమత్తం చేస్తోంది. ఇప్పటికే పలురకాలుగా మోసాలకు ఎగబడుతున్న సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం వేసిన ఈ ఎత్తుగడలో పడిపోయారంటే మాత్రం మీ యిష్టం.. అందుకే మీ సెల్‌లో వచ్చే అనవసరమైన యాప్స్‌ను ఒపెన్ చేయకండి. అసలే కరోనా కష్టకాలం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: