ఏపీ స‌మ‌గ్ర అభివృద్ధే ధ్యేయంగా పాల‌న సాగిస్తున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కొన్ని విష‌యాల్లో మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. రాజ‌కీయంగా చ‌ర్చోప‌చ‌ర్చ‌ల‌కు దారిస్తున్నాయి. విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయ రంగాల్లో స‌మూల మార్పులు తీసుకొస్తూ.. జ‌న‌రంజ‌క పాల‌న అందిస్తున్న సీఎం జ‌గ‌న్‌.. కొన్ని నిర్ణ‌యాల‌ను మాత్రం రాజ్యాంగం, చ‌ట్టానికి లోబ‌డి తీసుకోవ‌డం లేద‌ని, అవే ప్ర‌తిప‌క్షాల‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక్క‌డ ప్ర‌ధానమైన విష‌యం ఏమిటంటే.. సీఎం జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యాల్లో దాదాపుగా 50శాతానికిపైగా నిర్ణ‌యాల‌ను రాష్ట్ర హైకోర్టు త‌ప్పుబ‌ట్టింద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో హైకోర్టు ప్రభుత్వాన్ని తప్పుబట్టే కేసుల సంఖ్య పెరుగుతోందని విశ్లేష‌కులు అంటున్నారు. నిన్న వైసీపీ జారీ చేసిన 623 జీవోకు సంబంధించి హైకోర్టు ప్రభుత్వంపై కొన్ని కీల‌క‌ వ్యాఖ్యలు చేసింది. ఆ జీవోను రద్దు చేస్తారా? లేదా? చెప్పాలంటూ హైకోర్టు ఆదేశించడం గ‌మ‌నార్హం.

 

వైసీపీ రంగులను ప్రభుత్వ కార్యాలయాలకు తొలగించాలని వేసిన పిటిషన్‌పైనా విచారించిన కోర్టు... రంగులు తొలగించాలంటూ తేల్చిచెప్పింది. రాజకీయపార్టీలకు సంబంధించిన రంగులు కనిపించకూడదని హైకోర్టు చెప్పినప్పటికీ వైసీపీకి సంబంధించిన మూడు రంగులతో పాటు మరో మట్టి రంగును జతపరుస్తూ జీవో ఇచ్చింది రాష్ట్ర ప్ర‌భుత్వం.  దానిపై కూడా హైకోర్టు అభ్యంతరాలను కోడ్ చేస్తూ రంగులు తొలగించాలంటూ ప్రభుత్వాన్ని కోరింది. ఇదిలా ఉండ‌గా.. వైసీపీ ఎమ్మెల్యేల లాక్‌డౌన్ ఉల్లంఘనలకు సంబంధించి అంశం కూడా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. లాక్‌డౌన్ ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై ఎందుకు చర్చలు తీసుకోవద్దో చెప్పాలని హైకోర్టు వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే.

 

అంతేకాకుండా.. విద్యుత్ బిల్లుల అంశంపై కూడా ప్రభుత్వ చర్యలను హైకోర్టు తప్పుబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం. అలాగే డాక్టర్ సుధాకర్ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి విష‌యాలే ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను తీసుకొస్తాయ‌ని, జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. నిర్ణ‌యాలు తీసుకునేట‌ప్పుడు నిపుణుల స‌ల‌హాలు తీసుకుంటే మంచిద‌ని సూచిస్తున్నారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: