తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ప‌థ‌కం *డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు*. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం చేప‌ట్టి పేద‌ల‌కు అందిస్తోంది. తాజాగా.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పేదలకు రాష్ట్ర మునిసిపల్‌, పట్టణాభివృద్ధి మంత్రి  కేటీఆర్ శుభ‌వార్త చెప్పారు. ఆగస్టు నాటికి 50 వేల ఇళ్లు, దసరా నాటికి మరో 50 వేల ఇళ్లను పూర్తి చేసి, మొత్తం లక్ష ఇళ్లను పేదలకు అందిస్తామని ఆయ‌న‌ పేర్కొన్నారు. గ్రేటర్‌ పరిధిలోని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణంపై బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రేటర్‌ పరిధిలో తలపెట్టిన లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనులను నిరంతరం సమీక్షిస్తున్నామని, ఆగస్టు నాటికి 50 వేల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందిస్తామని కేటీఆర్‌ చెప్పారు. మిగతా 50 వే ల ఇళ్లను దసరా నాటికి అందిస్తామని ఆయ‌న అన్నారు. లాక్‌ డౌన్‌లోనూ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని, అయితే స్టీలు, సిమెంటు, ఇసుక లభ్యత ఇబ్బందులు ఉన్నాయని నిర్మాణ సంస్థలు మంత్రి దృష్టికి తెచ్చాయి.

 

 

దీనిపై సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని గృహ నిర్మాణ శాఖాధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఇప్పటికే 80 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయని, అన్ని శాఖల సమన్వయంతో మిగిలిన పనులను వేగవంతం చేయాలని ఆయ‌న‌ సూచించారు. నిర్మాణం పూర్తయిన తదుపరి జీహెచ్‌ఎంసీకి అప్పగించాలని కేటీఆర్‌ ఆదేశించారు. కాగా, గ్రేటర్‌ పరిధిలో ఇప్పటికే 10 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. అలాగే.. హైదరాబాద్‌లో మరో 45 బస్తీ దవాఖానాలను శుక్రవారం ప్రారంభించనున్నారు. బస్తీల్లో పేదలకు ఉచితంగా వైద్య సేవలందించే ఉద్దేశంతో ఢిల్లీ మొహల్లా క్లినిక్‌ల తరహాలో నగరంలో బస్తీ దవాఖానాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంత్రులు కేటీఆర్‌, ఈటల, మహమూద్‌ అలీ, తలసాని, సబిత, మల్లారెడ్డి ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. హడావుడి లేకుండా ప్రారంభోత్సవాలు జరుగుతాయని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: