దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తూ ఉండటంతో కేంద్రం లాక్ డౌన్ ను పొడిగిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ప్రభావం దేశంలోని అన్ని రంగాలపై పడింది. కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యంతో పాటు అనేక రంగాలపై పెను ప్రభావం చూపుతోందని తేలింది. ఈ మహమ్మారి వల్ల యువత భవిష్యత్తు అంధకారంలో పడింది.భవిష్యత్తులో కొలువులు దక్కించుకోవడం అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
చాలా మంది కరోనా మహమ్మారి వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే లక్షల కుటుంబాలు ఆహారం తినలేని స్థితికి చేరుకుంటాయని సీఎంఐఈ సర్వేలో తేలింది. ఈ సంస్థ సర్వేలో లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని.... కొత్తగా ఉద్యోగాల్లో చేరిన 30 ఏళ్ల లోపు యువతీ యువకులు 2.7 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని తేలింది. 
 
లాక్ డౌన్ వల్ల నిరుద్యోగ రేటు అంతకంతకూ పెరుగుతోంది.ప్రస్తుతం 23.8 శాతంగా ఉన్న జాతీయ నిరుద్యోగ రేటు లాక్ డౌన్ ముందుతో పోలిస్తే 15 శాతం ఎక్కువ కావడం గమనార్హం. సీఎంఐఈ ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 86 శాతం మహిళలు ఉన్నారని తెలిపింది. గత రెండు నెలల్లో కార్మిక బలగం కూడా తగ్గిందని... కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోగా కొత్త ఉద్యోగ అవకాశాల కల్పన మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తేలింది. 
 
ఉద్యోగాలు కోల్పోవడంతో ఆర్థిక ఇబ్బందులు అంతకంతకూ పెరుగుతున్నాయని... ఇంటి ఖర్చుల కోసం చాలామంది అప్పులపై ఆధారపడుతున్నారని... వాయిదాలతో కొనుగోలు చేసిన వస్తువులకు సకాలంలో వాయిదాలు చెల్లించలేకపోతున్నారని సర్వేలో తేలింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లలకు, వృద్ధులకు సరైన పౌష్టికాహారం అందడం లేదని.... పట్టణాల్లో నిరుద్యోగ రేటు అధికంగా ఉందని జనవరి నెలలో ఏపీలో నిరుద్యోగ రేటు 5.6 శాతంగా ఉండగా ఏప్రిల్ నాటికి ఆ రేటు 20.05 శాతానికి పెరిగిందని సీఎంఐఈ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: