తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం కరోనా తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో సింగిల్ డిజిట్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చిందని వార్తలు వచ్చాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా గత వారం రోజుల నుంచి అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతూ ఉండటం గమనార్హం. 
 
మిలిగిన కేసుల్లో ఎక్కువ మంది వలస కార్మికులు ఉన్నారు. మెహిదీపట్నం, వెంగళరావునగర్, అల్విన్ కాలనీ, లంగర్ హౌస్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన కరోనా అనుమానితులు ఫీవర్ ఆస్పత్రిలో చేరగా అధికారులు వీళ్ల నుంచి శాంపిళ్లు సేకరించి ల్యాబ్ కు పంపారు. మరోవైపు టప్పాచబుత్రలో ఒకే ఇంట్లో 8 మంది కరోనా భారీన పడ్డారు. 
 
ఇంట్లో ఒక వ్యక్తికి కరోనా సోకగా అతని నుంచి 8 మందికి కరోనా నిర్ధారణ అయింది. నగరంలో రాజేంద్రనగర్ కు చెందిన మహిళ జ్వరంతో బాధ పడుతూ లంగర్ హౌజ్ లోని పుట్టింటికి వెళ్లింది. ఆమెకు పరీక్షలు చేయించగా కరోనా నిర్ధారణ అయింది. వెంగళరావునగర్ లో ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ కావడంతో అతనిని ఆస్పత్రికి తరలించారు. అతనికి సన్నిహితంగా మెలిగిన మరో ఆరు మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. 
 
తాజాగా యాకుత్ పురా ఎస్.ఆర్.టీ కాలనీకు చెందిన మహిళకు కరోనా నిర్ధారణ అయింది. అల్విన్ కాలనీకు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు కరోనా భారీన పడ్డాడు. ఈయన క్యాన్సర్ తో కూడా బాధ పడుతున్నాడని సమాచారం. నగరంలో కొన్ని ఏరియాల్లో కరోనా తగ్గుముఖం పట్టినట్టే పట్టి మరలా విజృంభిస్తోంది. నగరంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని... మరికొన్ని రోజుల్లో కరోనా పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: