సుదీర్ఘ కాలం లాక్ డౌన్ త‌ర్వాత నిబంధ‌న‌లు స‌డ‌లించ‌డంతో ప్ర‌జా జీవితం ఒకింత సాధార‌ణ స్థితికి వ‌చ్చింది. ముఖ్యంగా ప్ర‌జా ర‌వాణ అందుబాటులోకి రావ‌డంతో రాక‌పోక‌లు పెరిగాయి. వ‌చ్చే జూన్ నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రైల్వే సేవ‌ల‌కు బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. పట్టాలు ఎక్కనున్న 200 ప్యాసింజర్‌ రైళ్లకు టికెట్లు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా మాత్రమే బుక్‌ చేసుకోవాలని, కౌంటర్లు బంద్‌ ఉంటాయని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో పాటుగా ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు, ఆదేశాలు రైల్వే శాఖ వెలువ‌రించింది.

 


రైళ్ల‌‌లో ప్ర‌యాణించే వారు మాస్క్‌ ధరించడం, ఆరోగ్య సేతు యాప్ క‌లిగి ఉండ‌టం‌ తప్పనిసరి అని రైల్వే శాఖ స్ప‌ష్టం చేసింది. ప్రయాణికులు 90 నిమిషాలు ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాలని పేర్కొన్న అధికారులు ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్‌ నిర్వహిస్తామ‌ని తెలిపారు. కరోనా లక్షణా లు లేని వారినే ప్రయాణానికి అనుమతినిస్తార‌ని స్ప‌ష్టం చేశారు. నాన్‌ ఏసీతో పాటు ఏసీ కోచ్‌లనూ నడుపనున్నారని వివ‌రించారు. గరిష్ఠంగా 30 రోజుల ముందు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చేసుకోవచ్చు అయితే, ఆర్‌ఏసీ, వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంటుంది. టికెట్‌ కన్ఫర్మ్‌ అయితేనే రైల్లోకి అనుమతిస్తారు.

 


ఇదిలాఉండ‌గా, తెలుగు రాష్ట్రాల్లో న‌డిచే రైళ్ల‌ వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు నుంచి సికింద్రాబాద్ మ‌ధ్య న‌డిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి నుంచి నిజామాబాద్ మ‌ధ్య న‌డిచే రాయలసీమ ఎక్స్‌ప్రెస్, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వ‌చ్చే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, ముంబై నుంచి హైదరాబాద్ మ‌ధ్య న‌డిచే హుస్సేన్‌ సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మ‌ధ్య న‌డిచే గోదావరి ఎక్స్‌ప్రెస్‌, హౌరా నుంచి సికింద్రాబాద్ మ‌ధ్య న‌డిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్ నుంచి దానాపూర్ వెళ్లే సూపర్‌ఫాస్ట్ రైళ్లు తాజాగా ప్రారంభం కానున్న సేవ‌ల్లో ఉన్నాయి.ప్ర‌యాణికులు ఆయా నిబంధ‌న‌లు పాటిస్తూ ప్రయాణం చేయాల‌ని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: