లాక్‌డౌన్‌తో క్లోజైన విమానయాన రంగం పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. మే 25 నుంచి సర్వీసులు ప్రారంభం కానుండడంతో.. దీనికి సంబంధించిన మార్గదర్శకాల్ని కేంద్ర విమానయానశాఖ విడుదల చేసింది. మెట్రో సిటీల మధ్య 33 శాతం సర్వీసులు ప్రారంభంకానుండగా... ఇతర నగరాల మధ్య పూర్తి స్థాయి సర్వీసులు ప్రారంభం కానున్నాయి. మరో మూడు నెలల్లో నూతన ధరల విధానం అమల్లోకి రానుంది. 

 

కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్‌... విమానయాన రంగంపై పెను ప్రభావం చూపాయి. ఎక్కడికక్కడ విమానాలు నిలిచిపోయాయి. నాలుగో విడత లాక్‌డౌన్‌లో కేంద్రం ఇచ్చిన సడలింపులతో.. తిరిగి విమాన సర్వీసులను ప్రారంభించాలని పౌరవిమానయాన శాఖ నిర్ణయించింది. మే 25  నుంచి విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు నిన్ననే తెలిపిన విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌పురీ.. ఇవాళ మరికొన్ని వివరాలు వెల్లడించారు. ప్రధానంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కత్ సహా మెట్రో  సిటీల మధ్య 33 శాతం... మెట్రో-నాన్ మెట్రో నగరాల మధ్య 33 శాతం  విమాన సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు హర్‌దీప్ పురి తెలిపారు. నాన్ మెట్రో నగరాల మధ్య పూర్తి స్థాయి సర్వీసులు నడుపుతామన్నారు. ఫ్లైట్ రూట్, సమయాన్ని బట్టి ధర ఉంటుందన్నారు. విమానయాన టికెట్ ధరల విషయంలో నూతన విధానం అమలు చేస్తామన్నారు.. అది ఏడు కేటగిరీలుగా ఉంటుందన్నారు. మూడు నెలల పాటు ఈ విధానం అమల్లో ఉంటుందని.. తర్వాత ధరల నిర్ణయంపై సమీక్ష జరుపుతామన్నారు. 

 

లైఫ్ లైన్ మిషన్ ఉడాన్‌.. 5 లక్షల కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసిందన్నారు మంత్రి పురీ..అలాగే 900 టన్నుల మెడికల్, నిత్యవసరాల తరలింపు కోసం.. దేశం నలుమూలల ఉడాన్ సర్వీసులు నిర్వహించినట్లు వివరించారు. అదే విధంగా వందేభారత్ మిషన్ ఉద్దేశ్యాన్ని వివరించారు పురీ. ఎవరైతే విదేశాల్లో చిక్కుకుని తిరిగిఇండియాకు రావాలనుకుంటున్నారో వారికోసమే.. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

 

విమాన ప్రయాణాలు చేసేవారు తప్పని సరిగా సెల్ఫ్ డిక్లరేషన్, ఆరోగ్య సేతు కలిగి ఉండాలని కొత్త నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. 14 ఏళ్లలోపు పిల్లలకు మినహాయింపు ఉంటుంది. యాప్‌లో గ్రీన్ కలర్ చూపించకున్నా.. ఫోన్‌లో యాప్ లేకున్నా వారికి అనుమతి ఉండదు. ఇక నుంచి పూర్తిగా వెబ్ చెక్ ఇన్ మాత్రమే ఉంటుంది. ఎవరైతే వైరస్ లక్షణాలు లేకుండా ఉంటారో , వారినే ప్రయాణానికి అనుమతించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: