వలస కూలీలను తరలించేందుకు ఏర్పాటు చేసిన వెయ్యి బస్సులకు ప్రియాంకా గాంధీ ఉపసంహరించుకున్నారు. 24 గంటలుగా ఢిల్లీ సరిహద్దులో ఉన్న బస్సులను యూపీ సర్కార్‌ అనుమతించకపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు... బస్సుల వ్యవహారంలో యూపీకి చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు ప్రియాంక.

 

వలస కార్మికుల్ని తరలించేందుకు మీ సరిహద్దులో బస్సులు ఎదురు చూస్తున్నాయి. సాయంత్రం నాలుగైతే... 24 గంటలవుతుంది. కావాలంటే మీరు వాటిని వాడుకోండి. మాకు అనుమతివ్వండి. బీజేపీ జెండాలు కట్టుకోండి, స్టిక్కర్లు అంటించుకోండి. కనీసం బస్సుల్ని తిరగనివ్వండి అంటూ..వెయ్యి బస్సుల్ని ఉపసంహరించుకోడానికి కొన్ని గంటల ముందు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఓ వీడియో పోస్ట్ చేసింది.

 

వలస కూలీల కోసం ప్రియాంక ఏర్పాటు చేసిన బస్సులను యూపీలోకి రానివ్వలేదు యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌. బస్సులకు ఆటోలు, టూ వీలర్ల రిజిస్ట్రేషన్ నెంబర్లు ఉన్నాయని... అందుకే వాటిని అనుమతించబోమని యూపీ సర్కార్ స్పష్టం చేసింది. దీంతో ఢిల్లీ-యూపీ సరిహద్దులోనే ఆగిపోయిన బస్సులను ఉపసంహరించుకున్నట్టు ప్రియాంక ప్రకటించారు. అయితే కాలి నడకన వెళ్తున్న వలస కూలీలకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అడుగడుగునా వాళ్లకు ఆహారం, మంచినీరు వంటివి అందజేస్తామని తెలిపారు ప్రియాంక.

 

మరోవైపు...  ప్రియాంక గాంధీపై సొంత పార్టీ యూపీ ఎమ్మెల్యే ఘాటు విమర్శలు చేశారు. వలస కూలీల నిమిత్తమై కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బస్సులు చాలా చిన్నవిగా ఉన్నాయంటూ రాయబరెలీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అదితీ సింగ్ విమర్శించారు. ఇది చాలా క్రూరమైన జోక్ అంటూ ట్వీట్‌ చేశారు అదితీ సింగ్‌.

 

మొత్తానికి వలస కూలీల వ్యవహారంలో తాము పంపిన బస్సులకు యూపీ సర్కార్‌ అనుమతించకపోవడం ఒక ఎత్తయితే... సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచి  ప్రియాంక విమర్శలు ఎదుర్కోవడం మరో ఎత్తు.

మరింత సమాచారం తెలుసుకోండి: