ఏ విషయమైనా మొహమాటం లేకుండా మాట్లాడుతూ, సొంత పార్టీ, విపక్ష పార్టీ అనే తేడాలేకుండా, అందరిపైనా ఒకే రకంగా విమర్శలు చేయడంలో ముందుండే వ్యక్తి గా అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముందు ఉంటారు. ప్రస్తుతం తెలుగుదేశం లోనే కొనసాగుతున్న జేసీ తెలుగు దేశం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం లేదు. ఎంపీగా ఓటమి చెందిన దగ్గర నుంచి జేసీ రాజకీయాలపై పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. ఇక విషయానికి వస్తే ఏపీలో విద్యుత్ బిల్లులు ఎక్కువగా రావడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లలోనే దీక్షకు దిగారు. ఈ మేరకు చంద్రబాబు పిలుపునివ్వడంపై తనదైన స్టైల్ లో జేసీ దివాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. నాయకులు ఇంట్లో కూర్చుని దీక్షలు చేస్తే ఫలితం ఏం  ఉంటుంది అంటూ ఆయన ప్రశ్నించారు. 

IHG


ఇటువంటి టైం వేస్ట్ కార్యక్రమాలని ఆయన మాట్లాడారు. అసలు ఇటువంటి దీక్షలు ఎందుకు చేయాల్సి వస్తుందో తెలుగుదేశం పార్టీ నాయకులకు అర్థం కావడం లేదని, ఆయన విమర్శించారు. ఇంట్లో కూర్చుని నాయకులు దీక్షలు చేస్తే, దానికి జగన్ స్పందిస్తాడా అంటూ ఆయన ప్రశ్నించారు. అమరావతిలో రాజధాని ప్రాంత వాసులు 188 రోజులుగా దీక్ష చేస్తున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇప్పుడు ఇంట్లో కూర్చుని మొక్కుబడిగా దీక్షలు చేస్తే ఫలితం ఏముంటుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో పూర్తిగా విలువలు తగ్గిపోయాయని, ప్రస్తుత రాజ్యం వైసీపీ వాళ్ళదే కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడులు జరుగుతున్నాయని, రాక్షస రాజ్యంలో ఇంతకంటే ఏం చేస్తాం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 

 


అలాగే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు విషయంలో జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా అని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జగన్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని, దీనిని అందరూ పార్టీలకతీతంగా అభినందించాలని జేసీ వ్యాఖ్యానించారు. జేసీ వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు ఎవరూ పెద్దగా స్పందించలేదు. జేసీ వ్యవహారం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అన్నట్టుగా అందరూ అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: