లాక్ డౌన్ కష్టకాలంలో అన్ని రంగాలు నష్టపోతున్నాయి. అన్ని రంగాల వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవులు మరింతగా కష్టపడుతున్నాయి. కొన్ని వందల కుటుంబాలు పస్తులతో పడుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో రాజకీయాల కన్నా సాయం చేయే పనుల ద్వారానే రాజకీయ నాయకుల విలువ పెరుగుతుంది.

 

 

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అదే చేస్తున్నాడు.. ఈ ప్రాంతంలో కరోనా కేసులతో ఆ మధ్య ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై అనేక వివాదాలు నడిచాయి. విమర్శలు, ప్రతివిమర్శలు వచ్చాయి. కానీ ఆయన వాటిని లైట్ గా తీసుకున్నారు. జనం కోసం ముందుకు కదిలారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణ లో 30 వేల కుటుంబాలకు ఆయన తన సొంత నిధులతో సాయం చేస్తున్నారు.

 

 

వేల కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. తాజాగా మూడోదఫా 5 రకాల కూరగాయాలను ఎమ్మెల్యే బియ్యం మధుసూదన్‌రెడ్డి పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా రాప్తాడు నుంచి సి విటమిన్ అధికంగా గల 30టన్నుల చీనీపండు , మదనపల్లి నుంచి 30 టన్నుల టమోటా, 25 టన్నుల క్యారెట్, అనంతపురం నుండి 20 టన్నుల ఎర్రగడ్డలు, కర్ణాటక నుంచి 20 టన్నుల క్యాబేజీ తెప్పించామన్నారు.

 

 

ఇలా తెప్పించిన సరుకులను ప్రతి ఇంటికి పంచి పెట్టామన్నారు. ప్రజలు తనను నమ్మి ఓటు వేసి గెలిపించారని, వారు ఈ రోజు కష్టాల్లో ఉన్నారని, వారి కష్టాలను తీర్చడానికి తన వంతు ఉడతాభక్తిగా ఈ సహాయం చేస్తున్నానని మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కష్టకాలంలో మాటలు కట్టి పెట్టి ఇలాంటి మేలు చేస్తే జనం నెత్తినపెట్టుకుంటారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: