కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని రాష్ట్రాలు ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నాయి. చివరకు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లోనూ కోత వేయాల్సి వచ్చింది. మళ్లీ మే నుంచి మొత్తం జీతాలు ఇస్తున్నారనుకోండి.. కానీ అసలు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత అంటేనే ఎలాంటి క్లిష్టపరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో తమ కోసం జగన్ ప్రవేశ పెట్టిన వాహన మిత్ర పథకం రెండో ఏడాది డబ్బు వస్తుందో రాదో అన్న అనుమానం చాలా మంది లబ్దిదారులలో ఉండేది.

 

 

అందులోనూ లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన వారు.. ఈసారి వాహనమిత్ర డబ్బు వస్తే కాస్త ఆసరాగా ఉంటుందని ఆశపడ్డారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి.. లాక్ డౌన్ కథలు విన్నాక ఈసారి డబ్బులు వేయడులే అనే అంతా అనుకున్నారు. కానీ అలాంటి వారికి ఊహించని షాక్ ఇచ్చాడు సీఎం జగన్. ఆర్థికంగా కష్టాలు ఉన్నా.. ఇచ్చిన మాట తప్పేది లేదన్నాడు. వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం కింద రూ.10 వేలు సాయం చేసేందుకు జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

 

2020-2021 ఆర్థిక సంవత్సరానికి వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, యజమానులకు రూ.10 వేల ఆర్థిక సాయం కోసం రెండో విడతలో 2,36,344 మందికి ఆర్థికసాయం ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. అర్హుల ఎంపికకు మరోమారు మార్గదర్శకాలు జారీ చేశారు. 8 కార్పొరేషన్ల ద్వారా నిధుల విడుదలకు ఆదేశాలు ఇచ్చారు. జూన్‌ 4న నిధుల విడుదలకు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 4న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు.

 

 

ఓనర్ కమ్ డ్రైవర్లు.. ఆటో మాక్సీ క్యాబ్, టాక్సీ డ్రైవర్లు సొంతంగా వాహనాలు కొనుక్కోని నడుపుకుంటూ.. వృత్తిగా జీవిస్తున్నవారికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి సంబంధించి లబ్దిదారుల దరఖాస్తు ప్రక్రియ మే 26 లోపు వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా పూర్తి చేస్తామని మంత్రి పేర్నినాని ఇదివరకే తెలిపారు. ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గతేడాది లబ్దిపొందిన వారు మళ్లీ దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆటోడ్రైవర్లు, వాహనమిత్ర లబ్దిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. కష్టకాలంలో రూ. 10 వేలు అంటే మామూలు విషయం కాదుగా మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: