దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా 5,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6,088 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 148 మంది మృత్యువాత పడ్డారు. ఒకేరోజు 6,000కు పైగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,18,447కు చేరింది. 
 
దేశంలో మృతుల సంఖ్య 3,583కు చేరింది. కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 48,534 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో 68,330 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో దాదాపు మూడు శాతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని ప్రకటన చేసింది. దేశంలో కరోనా బాధితుల్లో రికవరీ రేటు 40 శాతంగా ఉందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 6.65 శాతంగా ఉంది. 
 
భారత్ లో కరోనా మరణాల రేటు 3.06 శాతంగా ఉంది. కరోనా సోకిన వారిలో ఎక్కువ మంది పురుషులే కావడం గమనార్హం. మరోవైపు కేసులు పెరగడానికి కారణాల గురించి ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని తెలుస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదని తెలుస్తోంది. 
 
పలు ప్రాంతాల్లో ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా గురించి అవగాహన కల్పిస్తున్నా మాస్కులు ధరించాలని సూచిస్తున్నా ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. భౌతిక దూరం నిబంధనలు కూడా పాటించడం లేదు. నాలుగో విడత లాక్ డౌన్ లో భాగంగా భారీ సడలింపులు విధించటంతో పలు చోట్ల ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఈ కారణాల వల్లే కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: