హైద‌రాబాద్ న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న ఈ ప్రాంతం గురించి అంద‌రికీ సుప‌రిచిత‌మే. నగరంలోనే అత్యంత ప్రధాన రహదారుల్లో బంజారాహిల్స్‌ రోడ్‌ నం3 ఒకటి. ఈ దారిలో ఉన్న  ట్రాఫిక్‌ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పంజాగుట్ట శ్మశానవాటిక వద్దకు రాగానే బాటిల్‌నెక్‌ కారణంగా ట్రాఫిక్‌ ముందుకు కదిలేందుకు ఇబ్బందులు ఉండేవి. న‌గ‌రం నుంచి బంజారాహిల్స్ వైపు వెళ్లే వాటితో పాటుగా మాదాపూర్‌, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌ ప్రాంతాలనుంచి వచ్చే ట్రాఫిక్‌ మొత్తం టీవీ 9 చౌరస్తా దాటిన తర్వాత నాగార్జున సర్కిల్‌ దాకా నెమ్మదిగా సాగాల్సి వస్తోంది. ఈ రోడ్డు పై రోజుకు సుమారు 2 లక్షల దాకా వాహనాలు రాకపోకలు సాగిస్తాయని ట్రాఫిక్‌ ఇంజినీరింగ్‌ అధికారులు అంచనా.  టీవీ 9 చౌరస్తా నుంచి నాగార్జున సర్కిల్‌ దాకా ఉన్న కిలోమీటర్‌ దూరాన్ని దాటేందుకు ప్రస్తుతం 9 నుంచి 12నిమిషాలు పడుతోంది. అయితే, తాజాగా అందుబాటులోకి వ‌స్తున్న స్టీల్ బ్రిడ్జీతో ఆ స‌మ‌స్య తీరిపోనుంది.

 

 


న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణ చేయడంతో పాటు ప్రమాదకరమైన మలుపును తొలిగించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయించారు. జూబ్లీహిల్స్‌ వైపు నుంచి పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌ వైపు వెళ్లే ఇరుకైన దారిని విస్తరించడంతో పాటు శ్మశాన వాటికకు ఇబ్బందులు లేకుండా పైనుంచి రూ. 6కోట్ల వ్యయంతో జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్స్‌ పర్యవేక్షణలో ఈ పనులను శరవేగంతో పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే 43మీటర్ల పొడవైన స్టీల్‌ బ్రిడ్జి పనులు పూర్తవగా ప్రస్తుతం బ్రిడ్జికి రెండు వైపులా సుమారు 50 మీటర్ల పొడవైన అప్రోచ్‌ రోడ్డు పనులు చేస్తున్నారు. మార్చి 16న ప్రారంభమైన ఈ పనులను 151రోజుల్లో పూర్తి చేయాల్సి ఉండగా 76 రోజుల్లోనే సిద్ధం చేస్తున్నారు. సుమారు140 మంది కార్మికులు, భారీ యంత్రాల సాయంతో రేయింబవళ్లూ పనులు నిర్వహిస్తుండడంతో రికార్డు సమయంలో పూర్తి కావస్తున్నాయి. 

 

స్టీల్ బ్రిడ్జితో పాటుగా దాని మీద 6 మీటర్ల వెడల్పు రోడ్డుతో పాటు మీటర్‌ మేర ఫుట్‌పాత్‌ కూడా అందుబాటులోకి రానుంది. చట్నీస్‌ తర్వాత బ్రిడ్జి నుంచి కిందకు దిగిన తర్వాత వాహనాలు సాఫీగా వెళ్లేందుకు సుమారు 12మీటర్ల మేర రోడ్డును వెడల్పు చేస్తున్నారు. రాబోయే కాలంలో సుమారు 14 మీటర్ల రోడ్డును అందుబాటులోకి తెచ్చేలా విస్తరణ పనులు చేపట్టనున్నారు. స్టీల్ ‌బ్రిడ్జి కారణంగా `చట్నీస్`‌ వద్ద ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశాలున్న నేప‌థ్యంలో బ్రిడ్జి పైనే గ్రీనరీతో ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేస్తున్నారు. పంజాగుట్ట శ్మశానవాటిక ఎదురుగా నిర్మిస్తున్న స్టీల్‌ బ్రిడ్జి పనులను గురువారం మేయర్‌ బొంతు రామ్మోహన్‌  పరిశీలించారు. జూన్‌ 2న  రాష్ర్టావతరణ దినోత్సవం సందర్భంగా బ్రిడ్జిని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: