కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. అన్నిదేశాల‌ ఆర్థిక రంగాలు కోలుకోలేని దెబ్బతింటున్నాయి. ఇంతటి కష్టకాలంలో కూడా కొన్ని దేశాల్లో మాత్రం ఇబ్బందులు ఏమీ ఎదుర్కోవని క్రిసిల్ సంస్థ జరిపిన సర్వేలో వెల్లడైంది. భారత్‌, చైనా తదితర దేశాలు ఈ సంక్షోభం నుంచి తొందరగా కోలుకుంటాయని ఆ సర్వేలో వెల్లడైంది. అయితే ఇదే సంస్థ దేశీయంగా జరిపిన సర్వేలో ఆందోళనకరమైన విషయాలు వెలుగుచూశాయి. దేశంలో ప్రధానంగా మూడు రాష్ట్రాలు సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని సంస్థ వెల్లడించింది. ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతాయని ఆ సంస్థ జరిపిన సర్వేలో తేలింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మూడు రాష్ట్రాలు కూడా ఎక్కువగా మద్యం అమ్మకాలు, రిజిస్ట్రేష‌న్‌ స్టాంప్లు, పెట్రోల్ అమ్మకాలు పైనే ఆధారపడుతున్నాయి. కరోనా వైరస్ సృష్టించిన దారుణమైన పరిస్థితుల్లో ఈ మూడు రాష్ట్రాలు ముందు ముందు అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటాయ‌ని సర్వేలో తేలింది.

 

ఇప్పటికే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోంది. కరోనా వైరస్ కారణంగా దాదాపుగా అన్ని రంగాల కార్యకలాపాలు నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ నుంచి కొన్ని సడలింపులు రావడంతో ఇప్పుడిప్పుడే కొన్ని రంగాల కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. ఇంతటి కష్టకాలంలోనూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు తీసుకుంటున్నారు. మరి ఈ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని ఎలా గ‌ట్టెక్కించ‌డం అనేది పెద్ద సవాలుగా మారుతుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్ప‌టికే విప‌క్షాలు జ‌గ‌న్ స‌ర్కార్‌ను తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. క‌రోనా వైర‌స్‌ను నియంత్రించ‌డంలో, ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ విఫ‌లం చెందారంటూ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. వైసీపీ నేతలు కూడా ఇదే స్థాయిలో బాబుగారికి కౌంట‌ర్ ఇస్తున్నారు. ఏదిఏమైనా.. ఈ సంక్లిష్ట ప‌రిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: