రోజురోజుకు తెలుగుదేశం పార్టీలో ధిక్కార స్వరాలు పెరిగిపోతున్నాయి. అధినేత చంద్రబాబు ను లెక్కచేయకుండా ఇప్పటికే చాలామంది నాయకులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించాలని పదేపదే చెబుతున్నా, చాలామంది నాయకులు వాటిని పెడచెవిన పెడుతున్నారు. ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అన్న తేడా లేకుండా అందరూ తమకు ఎందుకులే అన్నట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు పార్టీ నాయకులు ఎవరికి ప్రత్యక్షంగా అందుబాటులో లేరు. హైదరాబాద్ నుంచి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ, పార్టీ నాయకులకు మీడియాకు అందుబాటులో ఉంటున్నారు.

 

IHG


 ప్రస్తుతం కరోనా కారణంగా రోడ్లపై ధర్నాలు, దీక్షలు చేసేందుకు అనుమతి లేకపోవడంతో ఇంటి దీక్షలకు పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని, అసలే లాక్ డౌన్ కారణంగా, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే ఈ సమయంలో విద్యుత్ బిల్లులు అమాంతం పెంచారని, ఇలా ఎన్నో సమస్యలపై చంద్రబాబు పార్టీ నాయకులు ఎవరికి వారు తమ ఇంటి వద్ద నిరసన దీక్షలు చేస్తూ, ప్రభుత్వ తీరును ఎండగట్టాలి అంటూ పిలుపునిచ్చారు. ఆ విధంగానే నిన్న పార్టీ నాయకులు దీక్షలకు దిగారు. అయితే ఈ దీక్షలపై టీడీపీ మాజీ ఎంపీ అనంతపురం జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి తప్పుబడుతూ విమర్శలు చేశారు.

 


 ఈ దీక్షలు ఇవన్నీ టైమ్ వేస్ట్ కార్యక్రమాలని, నాయకులు ఇళ్లల్లో దీక్ష చేస్తుంటే జగన్ పట్టించుకుంటాడా అంటూ జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. జేసీ వ్యాఖ్యలు బాగా వైరల్ అవ్వడంతో పాటు, అధికార పార్టీ నాయకులు కూడా జేసీ  చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విమర్శలు చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇదే విషయమై జేసీ కి ఫోన్ చేసి వివరణ కోరినట్టు తెలుస్తోంది. జేసీ వ్యాఖ్యలను అలాగే వదిలేస్తే మరికొంతమంది నాయకులు ధిక్కార స్వరం వినిపిస్తారని, అందుకే క్రమశిక్షణ విషయంలో ఎవరిని ఉపేక్షించకూడదు అని బాబు నిశ్చయించుకున్నారట. మరికొద్ది రోజులు జరగబోయే టీడీపీ మహానాడు కార్యక్రమంలో క్రమ శిక్షణ విషయాన్ని సీరియస్ గా ప్రస్తావించాలని చూస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: