చూస్తుండగానే 50లక్షలకు కరోనా కేసులు చేరాయి. అతి తక్కువ కాలంలో ప్రపంచమంతా వైరస్‌ బారిన పడింది. ఎన్నడూ లేనంతగా అతి తక్కువ కాలంలో ఇంత పెద్ద విపత్తు ప్రపంచం మొత్తానికీ వ్యాపించింది. కరోనా తీరు చూస్తే, ఇప్పుడున్న పరిస్థితుల్లో కోటి కేసులకు చేరటం కష్టం కాకపోవచ్చనే అంచనాలున్నాయి. 

 

ఐదు నెలలుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ బారినపడ్డవారి సంఖ్య అరకోటి దాటింది. చైనాలో గత ఏడాది వెలుగు చూసిన కరోనా వైరస్, భూమండలాన్ని చుట్టుముట్టి తన గుప్పిట్లో బంధించి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోంది. ఏరోజుకారోజు కేసుల ఉధృతి పెరుగుతూనే పోతోంది. వైరస్ వెలుగు చూసిన చైనాలో బీభత్సం సృష్టించిన వైరస్  ఆ తర్వాతి కాలంలో యూరప్‌ ను అతలాకుతలం చేసింది. అక్కడ కేసుల తీవ్రత కొంత తగ్గుముఖం పట్టినట్టే కనిపించినా.. అగ్ర రాజ్యాన్ని పూర్తిస్థాయిలో కుదిపేస్తోంది. ఒక్క అమెరికాలోనే.. 15 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ లు విధించడం వల్ల.. ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలడంతో దేశాలన్నీ చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది. అయితే అమెరికాలో 50 రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ ను ఎత్తేశారు. న్యూయార్క్, న్యూజెర్సీలు శవాల దిబ్బలుగా మారితే ఇప్పుడు అమెరికాలో మారుమూల ప్రాంతాలకూ వైరస్ విస్తరిస్తోంది. అయితే తాము అత్యధికంగా చేస్తున్న కోవిడ్ పరీక్షల కారణంగానే కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకుంటున్నారు.

 

ప్రపంచవ్యాప్తంగా.. ఇప్పటి వరకు కరోనా బారినపడి 3 లక్షల 30వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. వీటిలో దాదాపు లక్ష మరణాలు.. ఒక్క అమెరికాలోనే సంభవించడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. యూరప్, అమెరికాల్లో ఒక రేంజ్లో మృత్యు క్రీడ సాగించిన కరోనా క్రమంగా రష్యా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో విస్తరిస్తోంది. రష్యా, బ్రెజిల్ దేశాల్లో ప్రతీ రోజు యావరేజ్గా 10 వేల కేసులు నమోదవుతున్నాయి. 

 

గత జనవరిలో చైనా వుహాన్లో మొదటి కేసు నమోదైంది. సింగిల్ డిజిట్‌ తో మొదలైన ఆ ప్రాణాంతక మహమ్మారి.. అంతకంతకూ విజృంభిస్తూ ఇప్పుడు అరకోటిని దాటేసింది. 140 రోజుల్లో 50 లక్షలు క్రాస్ చేసింది. అయితే మొదటి 25లక్షల కేసులకు 112 రోజులు పడితే తర్వాత కేవలం 29 రోజుల్లోనే మరో 15లక్షల కేసులు నమోదయ్యాయంటే వైరస్ తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

 

జనవరి 22న కోవిడ్‌ మనుషులనుండి మనుషులకు వ్యాప్తిస్తుందని ప్రకటించింది. చైనాలో మొదటి కేసు జనవరి మొదటి వారంలో గుర్తిస్తే, మార్చ్‌ 6న లక్ష కేసులు దాటాయి.  ఏప్రిల్‌ 2 నాటికి అంటే లక్ష కేసులు గుర్తించి నెల దాటకముందే కరోనా  కేసులు 10లక్షలు దాటాయి. ఆ తర్వాత 13 రోజులకే మరో పది లక్షల కేసులు పెరిగి ఏప్రిల్‌ 15న 20 లక్షలకు చేరాయి. ఏప్రిల్‌ 27న 30లక్షల మైలురాయి దాటిన కేసులు, మే8న 40లక్షలకు శరవేగంగా చేరాయి. మరో 12 రోజులకు అంటే మే 20 నాటికి కేసులు అరకోటి చేరుకున్నాయి. 

 

లాటిన్ అమెరికా దేశాల్లోని బ్రెజిల్లో కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇటలీ, యూకేని దాటేసి మూడో స్థానంలోకి చేరుకుంది. కేసులు మూడు లక్షలకు చేరుకున్నాయి. దాదాపు 20వేలమంది మరణించారు. బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనోరా కరోనాని అసలు పట్టించుకోలేదు. వైరస్ వస్తే ఏమవుతుంది ? అంటూ వ్యాఖ్యలు చేసి ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొన్నారు. ఆంక్షలు కూడా విధించకపోవడంతో కేసులు అంతకంతకూ పెరిగిపోయి ఆస్పత్రి సౌకర్యాలు లేక రోగులకు చికిత్స అందివ్వడమే కష్టంగా మారింది. దీంతో మృతుల రేటు 6 శాతం నమోదవుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: