ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే బలం అన్న సంగతి తెలిసిందే. అందుకే తమ కోసం పోరాడుతున్న కార్యకర్తలకు పార్టీ నేతలు సపోర్ట్ ఉంటారు. అలాగే వారికి ప్రత్యర్ధి పార్టీ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురైన అండగా ఉండి, పోరాడే ప్రయత్నం చేస్తారు. అయితే ఇటీవల తమ కార్యకర్తలని వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని, టీడీపీ, జనసేన నేతలు నెత్తి నోరు బాదుకుంటున్నాయి.

 

సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చాలు వారి మీద అక్రమ కేసులు బనాయించి హింసిస్తున్నారని చెబుతున్నారు. అదే సమయంలో తమ మీద వైసీపీ కార్యకర్తలు అసభ్యకరంగా పోస్టులు పెట్టిన, వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, పోలీసులు వేధిస్తున్నారని రెండు రోజుల క్రితం పోలీస్‌స్టేషన్‌లో పురుగుల మందు తాగి జనసేన కార్యకర్త  లోకేష్‌ ఆత్మహత్యాయత్నం చేశాడు.

 

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు పోలీసులు వేధించడం నియంతృత్వాన్ని తలపిస్తోందని లోకేష్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిన పోలీసు అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. ఇదంతా జనసేన-వైసీపీలకు సంబంధించిన సమస్య. అయితే ఇందులోకి టీడీపీ వచ్చి ఎక్కువ ఫీల్ అయిపోతుంది. చంద్రబాబు చెప్పడంతో లోకేష్‌ని టీడీపీ నేతలు కొమ్మారెడ్డి పట్టాభి, ముళ్ళపూడి బాపిరాజులు పరామర్శించారు. తప్పుడు కేసులు పెడితే ఊరుకోమని పార్టీలకతీతంగా లోకేష్‌కు అండగా ఉంటామని రెండు డైలాగులు వేశారు. 

 

ఇక ఇక్కడ అర్ధం కానీ విషయం ఏంటంటే ఇప్పుడు ఇలా తమ కార్యకర్తలని, వేరే పార్టీ కార్యకర్తలని ఇబ్బంది పెడుతున్నారని వైసీపీపై ఫైర్ అయిపోతున్న టీడీపీ నేతలకు, గత అయిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడూ వైసీపీ, జనసేన కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు తెలియవా? అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. వైసీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టి ఎన్ని రకాలుగా హింసించారో అందరికీ తెలుసని, ఇప్పుడు కూడా ప్రభుత్వంపై విష ప్రచారం చేసిన వారిపైనే ఏపీ డీజీపీ చర్యలు తీసుకుంటున్నారని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: