స‌రిహ‌ద్దు దేశాల‌ను చైనా రెచ్చ‌గొడుతోందా..?  ఆయా దేశాలు క‌రోనాతో విల‌విలాడుతున్న వేళ‌.. క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోందా..? అంటే అగ్ర‌రాజ్యం అమెరికా మాత్రం ఔన‌నే మండిప‌డోతోంది. ముఖ్యంగా భారత్‌ సహా సరిహద్దు దేశాలపై చైనా కవ్వింపు చర్యలకు దిగుతోందని అమెరికా తీవ్రంగా విమర్శించింది. బలవంతంగా సైనిక చర్యలు చేపడుతూ మిలటరీని స‌రిహ‌ద్దుల వెంట‌ మోహరిస్తూ దురుసుగా ప్రవర్తిస్తోందని గురువారం వైట్‌హౌస్‌ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అలాగే.. ఎల్లో సీ, తూర్పు, దక్షిణ చైనా సముద్రాలు, తైవాన్‌ జలసంధి, భారత్‌ చైనా సరిహద్దుల్లో చైనా చేస్తున్న పనులకు, చెబుతున్న మాటలకి పొంతన లేదని ఆ నివేదికలో అగ్రరాజ్యం మండిప‌డింది.

 

చైనాను ఎదుర్కోవడానికి వివిధ దేశాలు, సంస్థలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆ నివేదిక అభిప్రాయపడింది. బలమైన శక్తిగా అవతరిస్తోన్న చైనా తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిని గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తోందని అమెరికా మండిపడింది. చైనా కమ్యూనిస్టు పార్టీ పొరుగు దేశాలపై దురుసుగా ప్రవర్తిస్తోందని విమర్శించింది. నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ చట్టాన్ని తీసుకువచ్చి ప్రపంచ దేశాల సమాచారాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చైనా చూస్తోందని, ఈ చట్టం ద్వారా అన్నిదేశాల‌ డేటాని తస్కరించే పనిలో ఉందని పేర్కొంది. ఇటీవలి కాలంలో భారత్, చైనా సరిహద్దుల్లో సైనికుల మధ్య ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో ఈ నివేదికను కాంగ్రెస్‌కి సమర్పించడం గమనార్హం.

 

అలాగే.. దక్షిణ చైనా సముద్రంలో చైనా చేపడుతున్న ఆపరేషన్లకు అదుపులేకుండా పోయిందని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పదవి నుంచి వైదొలగనున్న అలీస్‌ వెల్స్‌ అన్నారు. సరిహద్దు దేశాలపై కవ్వింపు చర్యల కు దిగుతూ సరిహద్దుల్ని మార్చడానికి చైనా ప్రయత్నిస్తోందని ఆమె మండిపడ్డారు. చైనా ఇప్పటికైనా ఇలాంటి చర్యల్ని ఆపేసి.. భారత్‌తో చర్చలు జరపాలని అన్నారు. చైనా భారత్‌తో చర్చలు జరిపి సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. అయితే.. ఇక్క‌డ మ‌రొక వాద‌న వినిపిస్తోంది. చైనా, భార‌త్‌ల మ‌ధ్య నెల‌కొన్న చిన్న‌చిన్న వివాదాల్లో అమెరికా త‌ల‌దూర్చుతోంద‌ని, ఇది మంచిప‌రిణామం కాద‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. చైనాను చూసి అమెరికా భ‌య‌ప‌డుతోంద‌ని, అందుకే భార‌త్‌తో స్నేహ‌సంబంధాల‌ను పెంపొందించుకునేందుకు ఇలా మైండ్‌గేమ్ ఆడుతోంద‌ని అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: