తెలుగుదేశం పార్టీ మహానాడు మహా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతేడాది సార్వత్రిక ఎన్నికల కారణంగా మహానాడు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడలేదు. ఇప్పుడు కరోనా  కారణంగా అది కూడా వాయిదా పడుతుందని అందరూ భావించగా, చంద్రబాబు మాత్రం ఏదో ఒక రూపంలో మహానాడు ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి పార్టీలో నూతనోత్సాహం తీసుకు రావాలని చూస్తున్నారు. ఈ నెలాఖరులోపు దీనిని నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తోంది. ఇక అధికార పార్టీ వైసీపీ మహానాడు లోపే తెలుగుదేశం పార్టీకి ఝలక్ ఇవ్వాలని చూస్తోంది. ఇప్పటికే టిడిపికి చెందిన బలమైన నాయకులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులు వైసీపీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారు. వీరందర్నీ మహానాడు జరిగే తేదీకి ముందుగానే  చేర్చుకుంటే ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగులుతుంది అని వైసిపి అంచనా వేస్తోంది.

 

IHG


అదీ కాకుండా ఇప్పటికే ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ కి అనుబంధంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారు డైరెక్ట్ గా పార్టీలో చేరితే అనర్హత వేటు పడుతుందనే ఉద్దేశంతో బయటి నుంచి వైసీపీకి మద్దతు ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. వైసీపీ కూడా ఇదే ఆలోచనలో ఉంది. చంద్రబాబును మానసికంగా దెబ్బ తీసి ఆ పార్టీ నాయకుల్లో గందరగోళం సృష్టించాలంటే ఇదే సరైన సమయం అని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లోనే ఉండిపోయారు ప్రతిరోజు జూమ్ యాప్ ద్వారా పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులో ఉంటున్నారు. అక్కడి నుంచే పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తూ హడావుడి చేస్తున్నారు. 


ప్రస్తుతం పార్టీ మారతారనే అనుమానం ఉన్న ఎమ్మెల్యేలతో చంద్రబాబు నేరుగా ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో మీ భవిష్యత్తుకు  ఎటువంటి డోకా ఉండదని, నాది హామీ అంటూ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అంచనా ప్రకారం అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయి నాయకులు వచ్చి చేరే అవకాశం ఉన్నట్లు భావిస్తోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు తదితరులు వైసీపీలో చేరేందుకు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏమైనా మహానాడు లోపు తెలుగుదేశం పార్టీకి గట్టి షాకే తగిలేలా కనిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: