తెలంగాణ‌ రాష్ట్రంలో భానుడు ఉగ్ర‌రూపం దాల్చుతున్నాడు. ఫలితంగా ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. ఉద‌యం 7గంట‌ల‌కే ఇంటి నుంచి అడుగుబ‌య‌ట‌పెట్టలేని ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. ఇక మ‌ధ్యాహ్నం అయితే.. నిప్పుల వ‌ర్షం కురిసిన‌ట్టే అనిపిస్తోంది. ఇక‌ శనివారం నుంచి మూడు రోజుల‌పాటు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వడగాలులు వీచే ప్ర‌మాదం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రధానంగా ఆదిలాబాద్‌, కుమ్రంభీంఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.

 

శుక్రవారం రాష్ట్రవ్యాప్తగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదైనట్టు పేర్కొన్నారు. ఖమ్మంలో 46 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 45.3 డిగ్రీలు, భద్రాచలం, హన్మకొండలో 44 డిగ్రీల చొప్పున, హైదరాబాద్‌లో 42.7 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 44 డిగ్రీలు, మెదక్‌లో 43.8 డిగ్రీలు, నల్లగొండలో 45 డిగ్రీలు, నిజామాబాద్‌లో 44.9 డిగ్రీలు, రామగుండంలో 44.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతుండ‌డంతో ప్ర‌జ‌లు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, అన‌స‌వ‌రంగా ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

 

ఇంటికే ప‌రిమితం కావాల‌ని, త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో మాత్ర‌మే బ‌య‌ట‌కు రావాల‌ని, ఈ స‌మ‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, ఎక్కువ‌గా నీళ్లు తాగాల‌ని చెబుతున్నారు. గొంతు ఎండిపోకుండా త‌రుచూ నీళ్లు తాగాల‌ని, లేనిప‌క్షంలో వ‌డ‌దెబ్బ‌కు గుర‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఈ వేస‌విలో ప్ర‌ధానంగా పిల్ల‌లు, వృద్ధుల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, వారిని త‌రుచూ గ‌మ‌నిస్తూ ఉండాల‌ని చెబుతున్నారు. మ‌ధ్యాహ్నం మ‌జ్జిగ తాగితే మంచిద‌ని చెబుతున్నారు. ఎక్కువ‌గా కొబ్బ‌రినీళ్లు, వివిధ పండ్ల ర‌సాలు తీసుకోవాల‌ని, శీత‌ల‌పానీయాల‌కు దూరంగా ఉండాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: