ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తైంది. గత సంవత్సరం ఇదే రోజున వైసీపీ రాష్ట్రంలో 151 ఎమ్మెల్యే స్థానాలలో, 22 ఎంపీ స్థానాలలో చరిత్రలో కనీవినీ ఎరుగని విజయం సొంతం చేసుకుంది. తిరుగులేని ప్రజా బలంతో వైసీపీ 50 శాతానికి పైగా ఓట్లు సాధించింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన రోజు నుంచి జగన్ తన నిర్ణయాలతో ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు. 
 
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తూ తన గొప్ప మనస్సును చాటుకుంటున్నారు. ఎన్నికలకు రెండేళ్ల ముందు నవరత్నాలను మేనిఫెస్టోగా ప్రకటించి అధికారంలోకి వస్తే నవరత్నాలను అమలు చేస్తానని చెప్పిన జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. వైయస్సార్ రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతు ఖాతాలో 13,500 రూపాయలు జమ చేసి రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. 
 
అమ్మఒడి పథకం ద్వారా పేద విద్యార్థుల తల్లి ఖాతాలో సంవత్సరానికి 15,000 రూపాయలు జమ చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే జగన్ 2000 రూపాయల పింఛన్ ను 2,250 రూపాయలకు పెంచి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతరులకు ప్రయోజనం చేకూరేలా చేశారు. జలయజ్ఞం ద్వారా రాష్ట్రంలోని పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తయ్యేలా కృషి చేస్తున్నారు. 
 
రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పిన జగన్ ఇప్పటికే రాష్ట్రంలో మద్యం దుకాణాలను భారీగా తగ్గించారు. మరో మూడేళ్లలో రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కానుంది. జులై 8వ తేదీన రాష్ట్రంలో 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఇతర రాష్ట్రాల్లో వైద్య చికిత్స చేయించుకునే అవకాశం కల్పించారు. కానీ సీఎం జగన్ తీసుకున్న పలు నిర్ణయాలకు కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వస్తున్నాయి. మోదీ, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొత్తలో వారికి కూడా ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. జగన్ కోర్టుల నుంచి ఎదురుదెబ్బలు తగలకుండా నిర్ణయాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: