ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్‌ను క‌నిపెట్టేందుకు అనేక దేశాల్లో ప్ర‌యోగాలు జ‌రుగుతున్నాయి. శాస్త్ర‌వేత్త‌లు రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నారు. ఈ మ‌హ‌మ్మారి బారి నుంచి మాన‌వాళిని కాపాడేందుకు అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌లుచోట్ల సానుకూల ఫ‌లితాలు వ‌స్తున్నాయి. తాజాగా.. మానవులపై తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు చేరిన మొదటి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఆశాజనక ఫలితాలిచ్చిందని ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ ది ల్యాన్సెట్లో‌ ప్రచురితమైన అధ్యయనం పేర్కొన్నది. ఈ వ్యాక్సిన్‌ మనుషుల్లో వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోగలిగే తటస్థ ప్రతిరక్షకాలను విడుదల చేసినట్లు ఆ అధ్యయనంలో వెల్లడించారు. అలాగే వైరస్‌ను అడ్డుక‌ట్ట వేయ‌డంలో కీలకపాత్ర పోషించే రోగనిరోధక వ్యవస్థలోని టీ-సెల్స్‌ సమర్థంగా ప్రతిస్పందించాయని చెప్పారు.

 

తొలిదశలో 108 మందిపై టీకాను ప్రయోగించినట్లు తెలిపారు. టీకా ఇచ్చిన 28 రోజుల తర్వాత వారిలో ఆశాజనక ఫలితాలను గమనించినట్లు ప‌రిశోధ‌కులు చెప్పారు. అయితే, ఈ టీకాపై మ‌రింత‌గా ప‌రిశోధ‌న జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు. మనుషులను ఈ వైరస్ నుంచి టీకా ఏ మేరకు రక్షించగులుగుతుందో నిర్ధారించడానికి ముందు మరింత లోతైన పరిశోధన జరుగాల్సిన అవసరం ఉందని బీజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ వ్యాక్సిన్‌వల్ల రోగనిరోధక వ్యవస్థలో వచ్చిన ప్రతిస్పందనలు కచ్చితంగా మనుషులను కొవిడ్‌-19 బారి నుంచి బయటపడేస్తాయని క‌చ్చితంగా చెప్పలేమని వారు పేర్కొన్నారు.

 

ఈ వ్యాక్సిన్‌ను 18 నుంచి 60 ఏళ్ల‌ మధ్య ఉన్న 108 మందిపై ప్రయోగించారట‌. వేర్వేరు మోతాదుల్లో వారికి వ్యాక్సిన్‌ ఇచ్చారట‌. అనంతరం తరచూ వారి రక్త నమూనాలను పరిశీలిస్తూ... వైరస్‌ను అడ్డుకోవడంలో కీలకపాత్ర పోషించే ప్రతిరక్షకాలు, టీ-సెల్స్‌ ప్రతిస్పందన ఎలా ఉందో గమనించారు ప‌రిశోధ‌కులు. అయితే టీకాను తీసుకున్న వారిలో పెద్దగా దుష్స్రభావాలు ఏమీ కనిపించలేదని పరిశోధకులు చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌రికొన్ని నెల‌ల్లో వ్యాక్సిన్ విష‌యంలో మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: