జగన్ సర్కార్ కు ఒకేరోజు మూడు ఎదురు దెబ్బలు తగిలాయి. మూడు భిన్నమైన కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్ఛాయి. హైకోర్టు ప్రభుత్వ కార్యాలయాలకు రంగు విషయంలో ప్రభుత్వం కోర్టు తీర్పును ధిక్కరించిందని వ్యాఖ్యలు చేసింది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ లపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తాజాగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సుధాకర్ కేసులో పోలీసుల తీరును కోర్టు తప్పుబట్టింది. 
 
మెజిస్ట్రేట్ నమోదు చేసిన వాంగ్మూలానికి ప్రభుత్వ నివేదికలకు చాలా తేడాలున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ వివరాలను నమ్మే పరిస్థితి లేదని హైకోర్టు పేర్కొంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఆ ఉత్తర్వులు చట్టవిరుద్ధమని, వెంటనే ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. 
 
జగన్ సర్కార్ నిర్ణయాలన్నింటికీ హైకోర్టులో వ్యతిరేక తీర్పులు వస్తున్నాయి. ఒకే రోజు ఏపీ ప్రభుత్వానికి మూడు దెబ్బలు తగలడంతో ప్రతిపక్షాలు ఎదురుదాడికి విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి మూడు ఎదురుదెబ్బలు తగలడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో ప్రభుత్వం అంతర్మథనంలో పడింది. సీఎం జగన్ ఈరోజు హైకోర్టు తీర్పుల గురించి ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు మొదలుపెట్టారు. 
 
నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నా ఎందుకు ఎదురుదెబ్బలు తగులుతన్నాయో జగన్ సర్కార్ కు అంతుచిక్కటం లేదు. తాజాగా వెలువడిన తీర్పులపై జగన్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టతో ముడిపడిన వ్యవహారాలు కావడంతో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ సర్కార్ మంగళవారం రోజున హైకోర్టు తీర్పులను సవాల్ చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.                          

మరింత సమాచారం తెలుసుకోండి: