ఆంక్షలకు పరంపర, వీసాల విషయంలో షాక్‌లు ఇస్తున్న అగ్రరాజ్యం అమెరికా మరో బ్యాడ్ న్యూస్ తెరమీదకు తెచ్చింది. కరోనా సాకుతో మనోళ్లకు భారీ షాక్ ఇచ్చే ఎత్తుగడను మొదలుపెట్టింది. అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో అతలాకుతలమవుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ స్థాయిలో దెబ్బ పడింది. దీంతో ఆ దేశంలో నిరుద్యోగిత రేటు భారీగా పెరిగిపోయింది. హెచ్-1బీ, ఎల్-1 వీసా జారీ విధానంలో కీలక సంస్కరణలను ప్రతిపాదిస్తూ రెండు ప్రధాన పార్టీలు రూపొందించిన బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టారు. ఇది భారతీయులకు షాక్ అని అంటున్నారు.
అమెరికా పౌరుల ఉద్యోగ అవకాశాలకు గండి పడకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టడంలో భాగంగా, హెచ్-1బీ అండ్ ఎల్-1 వీసా రిఫార్మ్ యాక్ట్ పేరిట చట్టసభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదం పొందితే హెచ్ 1బీ వీసాదారులకు ఇబ్బందులు తప్పవు. ఈ మేరకు అందులో కీలకమైన అంశాలు ప్రతిపాదించారు. అమెరికాలో చదివిన విదేశీ నిపుణులకు తొలి ప్రాధాన్యం లభించేలా చూడటమే లక్ష్యంగా ఈ బిల్లు ప్రవేశపెట్టారు. అమెరికా ఉద్యోగుల స్థానాన్ని హెచ్-1బీ, ఎల్-1 వీసాదారులను భర్తీ చేయడాన్ని పూర్తిగా నిషేధించాలని బిల్లులో స్పష్టం చేశారు. తాత్కాలిక శిక్షణా ప్రయోజనాల కోసం పెద్ద సంఖ్యలో హెచ్-1బీ, ఎల్-1 ఉద్యోగులను దిగుమతి చేసుకుని తిరిగి వారిని సొంత దేశానికి పంపుతున్న అవుట్ సోర్సింగ్ కంపెనీలపై ఉక్కుపాదం మోపాలని బిల్లులో ప్రతిపాదించారు.
కచ్చితమైన వేతన నిబంధన అమలు చేస్తే విదేశీ ఉద్యోగులను కంపెనీలు తెచ్చుకోవన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదన చేశారు. వీసా నిబంధనలు, ఉద్యోగుల నియామకాల విషయంలో ఆయా కంపెనీల యాజమాన్యాలు నిబంధనల ప్రకారం నడుచుకునేలా చూసేందుకు లేబర్ డిపార్ట్మెంట్కు మరిన్ని అధికారాలను కట్టబెట్టారు. ఆయా కంపెనీలు హెచ్-1బీ, ఎల్-1 వీసాదారుల సమగ్ర వివరాలు అందజేసేలా చూడాలి. నిబంధనల్ని ఉల్లంఘించినట్లు తేలితే శిక్షించే అధికారాన్ని కూడా బిల్లులో ప్రతిపాదించారు. మొత్తంగా అమెరికా పౌరుల ఉపాధి కాపాడటం కూడా ఓ ఉద్దేశమని ఈ బిల్లులో పేర్కొన్నారు.