పార్టీ జంపింగులు ఒకోసారి కలిసొచ్చినా, ఒకోసారి తలనొప్పులు తెస్తాయి. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇలాంటి తలనొప్పులు చాలానే ఎదురయ్యాయి. బాబు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపి వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలని టీడీపీలో చేర్చుకున్నారు. అయితే అప్పటికే టీడీపీలో ఉన్న నేతలు ఉండటంతో, వైసీపీ నుంచి వచ్చినవారికి, టీడీపీలో ముందు నుంచి ఉన్నవారికి అసలు పొసగలేదు. ఫలితంగా ఆధిపత్య పోరు పెరిగి, ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం పాలవ్వడానికి కారణమైంది.

 

అయితే జగన్ మాత్రం అలా చేయకుండా, పాత నేతలకు ఇబ్బందులు లేకుండానే కొత్త నేతలని చేర్చుకున్నారు. కాకపోతే ఈ చేరికల వల్ల కొన్ని చోట్ల ఇబ్బందులు మొదలయ్యాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లా చీరాలలో నేతల మధ్య ఆధిపత్యపోరు బాగా ముదిరిపోయింది. అసలు చీరాలలో 2014 ఎన్నికల్లో నవోదయ పార్టీ నుంచి గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ ఆ తర్వాత టీడీపీలోకి వెళ్ళి, 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చి, ఆ పార్టీ తరుపున పోటీ చేసి, టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం చేతిలో ఘోరంగా ఓడిపోయారు.

 

అయితే తర్వాత కరణం ఫ్యామిలీ కూడా వైసీపీలోకి వచ్చేసింది. పదవికి రాజీనామా చేయకుండా కరణం బలరాం టెక్నికల్‌గా పార్టీలో చేరకుండా, తన తనయుడు వెంకటేష్‌ని పార్టీలో చేర్పించారు. ఇదే సమయంలో ఇక్కడే ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా వైసీపీ వైపు వచ్చేశారు. దీంతో ఈ ముగ్గురు మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోయింది. తాజాగా కూడా వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కావడంతో ఈ మూడు వర్గాలు వైఎస్ విగ్రహానికి పోటాపోటీగా పూలమాలలు వేసి హడావిడి చేశారు.

 

అయితే వచ్చే ఎన్నికల్లో సీటు కూడా తమ ఫ్యామిలీకే అనే హామీతోనే కరణం కుటుంబం వైసీపీలో చేరింది. ఇదే సమయంలో ఆమంచి కూడా నెక్స్ట్ తానే పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాకపోతే ఈ రెండు వర్గాలకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పటికప్పుడు సర్ది చెబుతూనే ఉన్నారు. కానీ పరిస్థితులు మాత్రం అనుకూలంగా ఉండటం లేదు. మొన్న స్థానిక సమరం మొదలైన సమయంలో కూడా సీట్ల పంపకం విషయంలో పెద్ద రగడ జరిగింది. రెండు వర్గాల వారు పోటాపోటీగా నామినేషన్స్ కూడా వేశారు.

 

దీంతో మంత్రి బాలినేని, ఎంపీ మాగుంటలు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు అలాగే ఆధిపత్యం చెలాయించుకుంటున్నారు. అయితే జగన్ ఎంట్రీ ఇచ్చి, సర్ది చెబితేనే ఫలితం ఉండేలా కనిపిస్తోంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా న్యాయం చేస్తే, చీరాలలో వైసీపీలో విభేదాలు తగ్గేలా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: