తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం గతంలో వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకోని వారికి ఏప్రిల్, మే నెలలలో ఆర్థిక సహాయం మంజూరు చేయకూడదని సంగతి తెలిసిందే. తాజాగా వారికి కూడా ఆర్థిక సహాయం మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 2.08 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. వారి ఖాతాలలో ఏప్రిల్, మే నెలలకు ఒక్కో కుటుంబానికి 3,000 రూపాయల చొప్పున జమ చేసింది. 
 
ప్రభుత్వం 62.40 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. తెలంగాణ కరోనా విపత్తు సాయం కింద తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీలో భాగంగా ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి ఒక్కో వ్యక్తికి 6 కేజీల బియ్యం, రేషన్ కార్డుపై 1,500 రూపాయల చొప్పున ఏప్రిల్, మే నెలలకు పంపిణీ చేసింది. దాదాపు 74 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకు 2,227 కోట్ల రూపాయలు జమ చేసింది. 
 
బ్యాంకు ఖాతాలు లేని వారికి కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం పంపిణీ చేసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో బియ్యం తీసుకోని వారికి మాత్రం ఆర్థిక సాయం పంపిణీ చేయలేదు. దీంతో వారికి కూడా ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్లు వినిపించాయి. తాజాగా ప్రభుత్వం స్పందించి వారి ఖాతాలలో ఏప్రిల్, మే నెల నగదు 3,000 రూపాయలు జమ చేసింది. 
 
కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో నిన్న 52 కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 33 కేసులు నమోదు కాగా 19 మంది వలస కార్మికులు కరోనా భారీన పడినట్టు తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1013కు చేరగా... 49 మంది మరణించారు 

మరింత సమాచారం తెలుసుకోండి: