లాక్‌డౌన్ కార‌ణంగా తెలంగాణ‌లో చిక్కుకున్న వివిధ రాష్ట్రాల‌కు చెందిన వ‌ల‌స కార్మికుల‌కు కేసీఆర్ స‌ర్కార్ అండ‌గా నిలిచింది. ఉపాధి కోల్పోయి, తిండికి గడువక సొంతగూటికి బయల్దేరిన వలస కార్మికులను ప్రభుత్వ ఖర్చులతో రైళ్ల ద్వారా సురక్షితంగా ఇళ్ల‌కు చేర్చుతోంది. శని, ఆదివారాల్లో దాదాపు 50వేల మందిని వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు 46 శ్రామిక్‌ రైళ్లను ఏర్పాటు చేసింది. నాంపల్లి రైల్వేస్టేషన్‌లో శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి జెండా ఊపి శ్రామిక్‌ రైళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ, తెలంగాణ నుంచి ఇప్పటివరకు 1.70 లక్షల మంది వలస కార్మికులను 128 రైళ్ల ద్వారా సొంత రాష్ట్రాలకు పంపించామని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ చెప్పారు.

 

నాంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి 6 రైళ్లు, మరో 40 రైళ్లు వివిధ రైల్వేస్టేషన్ల నుంచి వివిధ రాష్ట్రాలకు బయలుదేరాయని ఆయ‌న అన్నారు. ఈ రైళ్ల ద్వారా దాదాపు 50 వేలమంది వలస కార్మికులను గమ్యస్థానాలకు త‌ర‌లిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కార్మికుడికి రెండు ఆహార పొట్లాలు, మూడు లీటర్ల తాగునీరు, పండ్లను అందిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇంతవరకు రిజిస్టర్‌ అయిన కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపే ప్రక్రియ పూర్తయిందని అధికారులు వెల్ల‌డించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట రైల్వే జంక్షన్‌ నుంచి మూడు శ్రామిక్‌ రైళ్లు ఒడిశాకు బయల్దేరాయని తెలిపారు. ఈ రైళ్లలో 5,304 మంది వలస కార్మికులు వెళ్లారన్నారు.

 

అదేవిధంగా మహబూబ్‌నగర్‌ నుంచి ఒడిశాలోని నవపహాడ్‌కు వెళ్లిన రైలులో 1750 మంది వెళ్లారని సోమేశ్‌కుమార్‌ తెలిపారు. సమన్వయంతో ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేస్తున్న అధికారులను ఆయన ప్రశంసించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో వలస కార్మికులు ఒక భాగం అని, ఆపదలో ఉన్న వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు చేర్చడం సంతోషంగా డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. నిజానికి.. లాక్‌డౌన్ విధించిన మొద‌ట్లో కూడా తెలంగాణ ప్ర‌భుత్వం కార్మికుల‌కు బియ్యంతోపాటు రూ.500లు కూడా ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: