భారతదేశంలో కరోనా వైరస్ రోజు రోజుకు రెచ్చిపోతోంది. రోజువారీగా సగటున రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా.. కేసుల సంఖ్య ఏ మాత్రమూ తగ్గడం లేదు. గ‌త 24గంట‌ల్లో ఏకంగా 6767 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 147 మంది మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3867 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు కేసుల సంఖ్య 1,31,868 వేల‌కు చేరుకుంది. ఇక‌ యాక్టివ్ కేసుల సంఖ్య‌ 73560గా ఉంది. ఈ ప‌రిణామాల‌తో అటు ప్రభుత్వం ఇటు ప్రజల్లో తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

 

కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించి  రెండు నెలలు అవుతోంది. ఈ రెండు నెలల కాలంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. త‌బ్లిఘి జ‌మాత్‌కు ముందు దేశంలో క‌రోనా ప్ర‌భావం పెద్ద‌గా క‌నిపించ‌లేదు. ఆ త‌ర్వాత ఒక్క‌సారిగా వైర‌స్ వ్యాప్తి వేగంగా జ‌రిగింది. ఇక‌ మొదట్లో లాక్ డౌన్ నిబంధనలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగానే అమలు చేశాయి. కానీ రోజులు గడిచే కొద్దీ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. రోజులు గడుస్తున్నా కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గకపోవడం.. మరోవైపు ఈ మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఇప్పట్లో లేకపోవడంతో పరిణామాలు వేగంగా మారిపోయాయి.

 

చాలా రోజులుగా ప్రజలు ఇంటికే పరిమితమై ఉండడం, ఆర్థిక కార్యకలాపాలన్నీ నిలిచిపోవడం, అనేక పరిశ్రమలు మూతపడి ఉండడం.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర సంక్షోభం వచ్చే ప్రమాదం ఉండడంతో కేంద్ర ప్రభుత్వం నిబంధనలలో సడలింపు ఇవ్వడం ప్రారంభించింది. దీంతో దేశవ్యాప్తంగా అనేక రంగాల కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఇదే సమయంలో కరోనా వైరస్ కేసులు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మొదట్లో వంద రెండు వందలుగా నమోదైన కేసులు ఇప్పుడు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఏకంగా రోజుకు సగటున 5 వేలకు తగ్గకుండా కేసులు నమోదు అవుతున్నాయి. అంటే పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు.

 

మరోవైపు లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, కూలీల‌ను స్వస్థలాలకు తరలిస్తున్నారు అధికారులు. దీంతో భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరో మలుపు తిరిగింది. వలస కార్మికులు కూలీలకు కూడా కరోనా వైరస్ సోకుతుండ‌డంతో తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రంగాల కార్యకలాపాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదు కావడం తీవ్ర పరిణామాలకు సంకేతమని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

 

ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్లకుండా లాక్ డౌన్ అమలులో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లనే నేడు ఇంతటి విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయని మరికొందరు అంటున్నారు. ఇక దేశంలో ముందుముందు తీవ్ర పరిణామాలు ఉండడం ఖాయమని, అతి తక్కువ వైద్య సదుపాయాలు ఉన్న భారతదేశం వీటిని ఎదుర్కోవడం అంత సులభమేమీ కాదని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ముందుకు వెళ్తాయో చూడాలి మరి..!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: